– అంత ఉబలాటం ఉంటే స్థానిక సంస్థలు రద్దు చేసి ఎన్నికలకు రండి
– ఈనెల 8న కురుబ లింగమయ్య కుటుంబానికి వైయస్ జగన్ పరామర్శ
– పది నెలల కూటమి పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు
– చంద్రబాబు పీ–4 కాన్సెప్ట్ అంతా ఓ బూటకం.. నాటకం
– ప్రజలను ఊహాలోకంలోకి తీసుకెళ్తున్న చంద్రబాబు
– సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి సర్కారు విఫలం
– ఐదేళ్ల జగన్ పాలనలో లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.2.72 లక్షల కోట్లు
– గడిచిన 10 నెలల్లో పింఛన్ల పంపిణీకే పరిమితమైన ప్రభుత్వం
– ఇప్పటికే ఏకంగా 3 లక్షల మందికి పైగా పింఛన్లు కోత
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఎప్పుడిస్తారు?
– మేలో తల్లికి వందనం అనడం లబ్ధిదారుల్లో కోత పెట్టేందుకే..!
– ప్రతి నిరుద్యోగికి రూ.30 వేలు బాకీ పడిన చంద్రబాబు
– జిల్లాకు 55 టీఎంసీలు వస్తే 55 వేల ఎకరాలకే అందించడమేంటి?
– నీళ్లు ఏమయ్యాయో ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై లేదా?
– ప్రజలు తిరుగులేని మెజార్టీ ఇచ్చింది మీరు సంపాదించుకోవడానికా?
– వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి సూటి ప్రశ్న
అనంతపురం, ఏప్రిల్ 1 :
అధికార పార్టీ అరాచకాలను ఎదుర్కొనేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజార్టీ లేదని తెలిసినా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు చేశారని మండిపడ్డారు. అయినా 51 స్థానాలకు గాను 39 స్థానాల్లో వైసీపీ విజయం సాధించిందని చెప్పారు. బుధవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో తమ పార్టీ గుర్తు మీద గెలిచిన ప్రతినిధులే ఉన్నారని తెలిపారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయని, ఇలాంటి తరుణంలోనూ అధికార పార్టీ నేతలు దౌర్జన్యం చేయడం ఏంటని ప్రశ్నించారు. గతంలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు తన పార్టీలోకి తీసుకున్నారని గుర్తు చేశారు. ఇప్పడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ లేదని తెలిసినా సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ‘‘అంత ఉబలాటంగా ఉంటే.. చట్ట పరిధిలో అవకాశం ఉంటే స్థానిక సంస్థలను రద్దు చేయండి. ఎన్నికలకు వెళ్దాం. అంతేగానీ ఇలా దొడ్డిదారిలో తీసుకోవడం ఏంటి? రామగిరిలో మాకు మెజార్టీ లేదని, ఎంపీపీ అభ్యర్థి కూడా లేరని పరిటాల సునీతే స్వయంగా చెప్పారు. కానీ రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ విషయంలో జరిగిన దౌర్జన్యాలు ఏంటి? 15, 20 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులను మళ్లీ తీసుకురావాలని అనుకుంటున్నారా? శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు కూడా చేతులెత్తేశారు.. ఎస్పీలతో కూడా నేను మాట్లాడాను. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు పోలీస్‌స్టేషన్లు తీసేయమంటే తీసి వేయడానికి సిద్ధంగా ఉన్నారా? అని అడిగాను. రామగిరి మండలంలో జరిగిన అరాచకానికి కారణం ఎవరు? మా సింబల్ పై గెలిచిన వాళ్లను ఎలా తీసుకెళ్తారు? మిమ్మల్ని ఎదిరిస్తే మనుషుల్ని చంపేస్తారా? పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్య కుటుంబానికి మా పార్టీ అండగా ఉంటుంది. ఈనెల 8వ తేదీన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ కుటుంబానికే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ అండగా ఉంటారు’’ అని స్పష్టం చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరుగుతున్న దౌర్జన్యాలు, అరాచకాలకు సీఎం చంద్రబాబు బాధ్యత తీసుకోవాలని తెలిపారు.
10 నెలలుగా చంద్రబాబు ప్రచార ఆర్భాటం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతోందని, కేవలం ప్రచార ఆర్భాటానికే చంద్రబాబు పరిమితం అవుతున్నారని అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలతో పాటు జగన్ అందించిన సంక్షేమం కంటే రెట్టింపు సంక్షేమాన్ని అందిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రచారం చేశారన్నారు. ఈ 10 నెలల్లో ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. సిలిండర్లు మాత్రమే అరకొరగా అందిస్తున్నారని తెలిపారు. పాత సీసాలో కొత్త సారా అన్నట్లు కొత్త కొత్త పేర్లతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఉగాది రోజున పీ–4 అంటూ నినాదం తీసుకొచ్చారని, ధనవంతులు పేదలను దత్తత తీసుకోవడం కొత్తేమీ కాదన్నారు. చంద్రబాబు చెబుతున్న పీ–4 కాన్సెప్ట్ అంతా ఓ బూటకం.. నాటకం అని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా ఎమ్మెల్యేలు గ్రామాలను దత్తత తీసుకున్నారని, ఆ తర్వాత గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. చెప్పిన అపద్ధాన్ని మళ్లీ చెప్పకుండా చంద్రబాబు కాలయాపన చేస్తున్నారన్నారు.
భ్రమల్లో తేలుతున్న చంద్రబాబు
రాష్ట్రంలో పేదరికం లేకుండా చేస్తానని చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నారని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. 2029 నాటికి పేదరికం లేకుండా చేస్తానని, 2047 నాటికి కుటుంబ తలసరి ఆదాయాన్ని రూ.55 లక్షలకు చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు భ్రమల్లో తేలిపోతూ ప్రజలను ఊహాలోకంలో తిరిగేలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల పరిధిలో ఎంత మంది పేదరికంలో ఉన్నారో ప్రకటించాలన్నారు. ధనవంతులను పేదలకు అనుసంధానం చేస్తానని చెప్పడం మరోసారి ప్రజలను మోసం చేయడానికేనని అన్నారు.
సీఎం హోదాలో చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం
జగన్ ఐదేళ్లలో నొక్కిన బటన్లన్నీ తాను పింఛన్ల కోసం నొక్కిన బటన్‌తో సమానం అని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అనంత తెలిపారు. ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ బటన్ నొక్కితే నేరుగా రూ.2.72 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్లాయన్నారు. ఎక్కడా దళారులు, మధ్యవర్తులు, అవినీతికి ఆస్కారం లేకుండా పాలన సాగించారని తెలిపారు. భవిష్యత్‌లో చంద్రబాబు అందించే పథకాలను ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. మళ్లీ మధ్యవర్తులను రంగంలోకి దించుతారా? అని అడిగారు. 2004 వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నారని, కానీ ఏనాడూ శాచ్యులేషన్ పద్ధతిలో పథకాలను తీసుకురాలేదన్నారు. తొలిసారిగా వైఎస్ రాజశేఖరరెడ్డి పింఛన్ల పంపిణీలో శాచ్యులేషన్ తెచ్చారని, ఆ తర్వాత వైఎస్ జగన్ ఒక అడుగు ముందుకు వేసి అన్ని సంక్షేమ పథకాలను శాచ్యులేషన్ పద్ధతిలో అందించారని గుర్తు చేశారు.
10 నెలల్లో 3 లక్షలకు పైగా పింఛన్ల కోత
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల 34 వేల 742 పింఛన్‌దారులు ఉండేవారని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 63 లక్షల 27 వేల మందికి మాత్రమే పింఛన్ మంజూరు చేశారని తెలిపారు. అంటే 10 నెలల వ్యవధిలోనే ఏకంగా 3 లక్షలకు పైగా పింఛన్లను కోత పెట్టారన్నారు. ఒక్క అనంతపురం నగరంలో మాత్రమే వెయ్యి మందికి పైగా పింఛన్లు తొలగించారని తెలిపారు. రీసర్వే పేరుతో దివ్యాంగుల పింఛన్లలోనూ కోతలు పెడుతున్నారన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పింఛన్ల కోసం రూ.27 వేల కోట్లు కేటాయించారని, వాస్తవానికి ఇప్పుడున్న పింఛన్‌దారుల కోసమే రూ.33,800 కోట్ల అవసరం అవుతాయని చెప్పారు. దీన్ని బట్టి భవిష్యత్‌లో పింఛన్లలో మరింత కోత తప్పదని తెలుస్తోందన్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17 లక్షల నుంచి 20 లక్షల మంది ఉన్నారని, వాళ్లకు పింఛన్లు ఎప్పుడు ఇస్తారు? అని అన్నారు.
తల్లికి వందనంలోనూ కోతలే..!
తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు తొలి ఏడాది ఈ పథకాన్ని అమలు చేయలేదని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ ఏడాది మేలో తల్లికి వందనం అందిస్తామని చెప్పడం వెనుక లబ్ధిదారుల్లో కోత పెట్టే ఆలోచన ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సాధారణంగా జూన్ మాసంలో స్కూళ్లు తెరిచాక ఆ నెలాఖరుకు ఎంత మంది విద్యార్థులు ఉన్నారన్న వివరాలు వస్తాయని తెలిపారు. అయితే స్కూళ్లు తెరుచుకోకముందు ఇస్తామని చెప్పడం అంటే ప్రజలను మరోసారి మోసం చేస్తూ కోతలు పెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇక 19 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1500 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ 10 నెలల్లో ఒక్క నిరుద్యోగికైనా రూ.3 వేలు ఇచ్చారా? అని అడిగారు. 10 నెలలకు గాను ఒక్కో నిరుద్యోగికి రూ.30 వేలు చంద్రబాబు బాకీ పడ్డారన్నారు. రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పి తొలి ఏడాది ఎగనామం పెట్టారన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. ఒక వైపు కరువు, మరోవైపు అరకొర పండిన పంటలకు గిట్టుబాటు ధర అందడం లేదన్నారు. నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరుగుతున్నా రైతులు పండించిన పంటకు మాత్రమే ధర రావడం లేదన్నారు. దళారులు రాజ్యం ఏలుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నట్లు చెప్పారు.
55 టీఎంసీలు 55 వేల ఎకరాలకేనా?
గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాకు హెచ్‌ఎల్‌సీ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ (హంద్రీనీవా) ద్వారా సుమారు 55 టీఎంసీలు వస్తే కేవలం 55 వేల ఎకరాలకు అందించినట్లు సాక్షాత్తూ కలెక్టర్ ప్రకటించారంటే ఇంతకంటే దురదృష్టకరం ఇంకొకటి ఉంటుందా? అని అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. ‘‘జిల్లాకు 30.9 టీఎంసీల హెచ్‌ఎల్‌సీ ద్వారా వచ్చాయి. 24 టీఎంసీంలు హంద్రీనీవా ద్వారా వచ్చాయి. ఒక టీఎంసీ 9 వేల ఎకరాలకు రావాలి. అంటే దాదాపు 4.50 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ ఇవ్వాల్సి ఉంటే కేవలం 55 వేల ఎకరాలకు మాత్రమే ఇచ్చారని స్వయంగా కలెక్టరే ప్రకటించారు. పోనీ పీఏబీఆర్‌లో 5 టీఎంసీలు నిల్వ చేసుకున్నారా అంటే ప్రస్తుతం కేవలం 2.7 టీఎంసీ ఉన్నాయి. ఇక పెనకచెర్లలో 0.5 టీఎంసీలు కూడా లేవు. 55 టీఎంసీలు వస్తే 55 వేల ఎకరాలకే ఇచ్చారంటే మిగతా నీళ్లు ఎక్కడకు వెళ్లాయి? సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై లేదా? అడగాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై లేదా?’’ అని అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ప్రజాప్రతినిధులు మాత్రం సంపాదనలో మునిగిపోయారని మండిపడ్డారు. ఇందుకేనా ప్రజలు మీకు తిరుగులేని మెజార్జీ ఇచ్చింది? అని ప్రశ్నించారు.