332 మండలాల్లో తీవ్ర నీటి కొరత

Praja Tejam
0

 FacebookEmailWhatsAppX


  •   3,549 నివాస
    ప్రాంతాలపై ప్రభావం
  • అంచనా వేసిన ప్రభుత్వం

 అమరావతి బ్యూరో : వేసవి తీవ్రతతో రాష్ట్రంలో దాదాపు సగం మండలాలు తీవ్ర నీటి కొరత ప్రమాదాన్ని ఎదుర్కోనున్నాయి. దీనిపై ఇప్పటి వరకూ యాక్షన్‌ ప్లాను పూర్తికాలేదు. వెంటనే రోజువారీ పరిస్థితుల నివేదిక (డైలీ సిచ్యుయేషన్‌ రిపోర్ట్‌-డిఎస్‌ఆర్‌) రూపొందించి పంపించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. అలాగే వేసవి యాక్షన్‌ ప్లాను నివేదిక వచ్చిన వెంటనే ఏయే పనులు చేపట్టాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని, అత్యవసరం, అవసరం అనే రెండు పద్ధతుల్లో స్పష్టమైన నివేదిక ఉండాలని సూచించింది. రాష్ట్రంలో 679 మండలాలు ఉండగా, 332 మండలాలు నీటి కొరతను ఏదుర్కొంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మండలాల పరిధిలో 3,549 నివాస ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటారనీ తేల్చింది. ఈ సమస్యను పరిష్కరించడంతోపాటు తాగునీటికి ఇబ్బంది లేకుండా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే దానికి సంబంధించి నిధులు వినియోగంపై స్పష్టత రావాల్సి ఉందని కలెక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం నీటి కొరత ఇబ్బందులున్న మండలాల పరిధిలో తక్షణమే 1,611 బోర్లను రిపేర్లు చేయాల్సి ఉంది. భూగర్భ జలాలు తగ్గిన నేపథ్యంలో మరో 1,097 బోర్లను మరింత లోతుకు వేయాల్సి ఉంది. దీనిపై నివేదికను కలెక్టర్లు ప్రభుత్వానికి పంపించినా నిధుల వినియోగంపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనట్లు తెలిసింది. వీటితోపాటు 56 సమ్మర్‌ స్టోరేజీ (ఎస్‌ఎస్‌) ట్యాంకులను నింపాల్సి ఉంది. ఈ నీటిని ఎలా నింపాలనే అంశంపై అధికారుల్లో కొంత ఆందోళన ఉంది. ఏప్రిల్‌ రెండోవారంలో తాగునీటి చెరువులను నింపేందుకు నీటిని వదలాల్సి ఉంది. అప్పటికి ఎంత మొత్తం నీటిని వదులుతారు, ఎన్ని చెరువులు నింపుతారు అనే అంశంపై జలవనరులశాఖ నుండి నివేదిక తయారు చేసినా నీరు ఎంతవరకు అందుబాటులో ఉంటుందనే అంశంపై స్పష్టత రావడం లేదని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికి కొంత చెరువులు నింపామనీ, 60 రోజులకు సరిపడే విధంగా నీటిని నింపాలని ఆదేశాలు ఉన్నా 70 శాతం మాత్రమే పూర్తి చేశామని చెబుతున్నారు. మరోవైపు గ్రామీణ తాగునీటి సరఫరాకు సంబంధించి రూ.930 కోట్ల వరకూ విద్యుత్‌ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే స్కీములకు విద్యుత్‌శాఖ అధికారులు నోటీసులు పంపిస్తున్నట్లు తెలిసింది.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">