, హిందూపురం/చిలమత్తూరు, అక్టోబరు 13 ప్రజాతేజమ్ : పొట్టకూటి కోసం వచ్చిన వలస కూలీలపై అర్ధరాత్రి మానవ మృగాలు విరుచుకుపడ్డాయి. నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో పనిచేస్తున్న వాచ్‌మన్ కుటుంబానికి చెందిన అత్తాకోడలిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాయి.
24 గంటల్లోనే అదుపులోకి నిందితులు?
అత్యాచారం జరిగిన 24 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. దుండగులను పట్టుకునేందుకు ఎస్పీ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రానికే నిందితుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. నిందితుల్లో ముగ్గురు పాత నేరస్థులు, వారిలో ఒకరు అంతర్రాష్ట్ర మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. నిందితుల్లో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం. వీరు చోరీ చేసేందుకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణలో ఒప్పుకొన్నట్టు తెలిసింది.
బాధితులకు అండగా ప్రభుత్వం: సీఎం
ఘటనను ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది. సీఎం చంద్రబాబు జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని, నిందితులను వెంటనే పట్టుకుని, కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారిలో భరోసా నింపాలని ఎస్పీని ఆదేశించారు. హోంమంత్రి అనిత కూడా జిల్లా ఎస్పీతో మాట్లాడి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బాధితులను ఫోన్‌లో పరామర్శించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని భరోసా ఇచ్చారు.
ఉనికి కోసమే వైసీపీ విమర్శలు: మంత్రి సవిత
హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధిత మహిళలను బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత, హిందూపురం ఎంపీ బీకే పార్థసారధి ఆదివారం పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఆస్పత్రి బయట మంత్రి సవిత విలేకరులతో మాట్లాడుతూ... గ్యాంగ్‌రేప్‌పై సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, ఎస్పీ వేగవంతంగా స్పందించారన్నారు. 24 గంటలు తిరక్కుండానే నిందితులను పోలీసులు గుర్తించారని తెలిపారు. పోలీసులు స్పందిస్తున్నది వైసీపీ నాయకుల కళ్లకు కనబడలేదా? అని మండిపడ్డారు. ఉనికి కోసం వైసీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.