ప్రైవేటు మద్యం దుకాణాల
దరఖాస్తుకు ముగిసిన గడువు
● ఉమ్మడి జిల్లాలో 204 దుకాణాలకు
5,168 దరఖాస్తులు
● జనాభా ఆధారంగా ఫీజు వసూళ్లు
● 14న లక్కీడిప్
● ఏర్పాట్లలో ఎకై ్సజ్ అధికారులు
కర్నూలు: అధికార పార్టీ నేతల బెదిరింపులు, సిండికేట్ల పంచాయతీలు, వ్యాపారుల తర్జనభర్జనల మధ్య జిల్లాలో మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తుల దాఖలు ప్రక్రియ ముగిసింది. వ్యాపార వాంఛ, మధ్యవర్తుల రాయబేరాల ఘటనలు పలు నియోజకవర్గాల్లో చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీలో దుకాణం దక్కించుకోవడానికి అధికార పార్టీ నేతలు, దళారులు (సిండికేట్లు) ఎత్తులకు పైఎత్తులు వేస్తూ దరఖాస్తులు సమర్పించారు. ఐదేళ్ల తర్వాత అమలులోకి వచ్చిన నూతన మద్యం పాలసీ వ్యాపారుల్లో కూడా కిక్కు పెంచింది. లైసెన్స్ ఫీజు ఆరు విడతలుగా చెల్లించుకునే వెసులుబాటు ఉండటంతో వ్యాపారులు కొన్ని దుకాణాలకు తీవ్రంగా పోటీ పడ్డారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు రెండు రోజుల పాటు ప్రభుత్వం గడువు పెంచడం వల్ల దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. మద్యం దుకాణాల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నాయకులు తమ బినామీల పేర్లతో దరఖాస్తులు వేయించారు. కొందరు వ్యాపారంపై కనీస అవగాహన లేకపోయినప్పటికీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లాటరీలో తగిలితే దరఖాస్తు విలువ రూ.2 లక్షల బదులు ఐదు రెట్లు ఎక్కువగా వేరే వారికి ఇచ్చేయవచ్చనే ఆలోచనతో దరఖాస్తు చేశారు. దరఖాస్తుల దాఖలులో ఎకై ్సజ్ శాఖ ఊహించిన స్థాయిలో స్పందన లభించింది.
ఉమ్మడి జిల్లాలో
5 వేల పైచిలుకు దరఖాస్తులు...
ఉమ్మడి కర్నూలు జిల్లాలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయానికి 5,168 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇందులో కర్నూలు జిల్లాలోని ఏడు ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో 99 దుకాణాలకు గాను 3,013 దరఖాస్తులు వచ్చాయి. దుకాణానికి సగటున 30కి పైగా దరఖాస్తులు అందినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా కర్నూలు స్టేషన్ పరిధిలో 31 దుకాణాలకు 1,427 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అత్యల్పంగా కోసిగి స్టేషన్ పరిధిలో 4 దుకాణాలకు కేవలం 53 మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. అలాగే నంద్యాల జిల్లాలో ఏడు ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో 105 దుకాణాలకు గాను 2,155 దరఖాస్తులు వచ్చాయి. దుకాణానికి సగటున 20 దరఖాస్తులు దాఖలయ్యాయి. జిల్లాలో అత్యధికంగా నంద్యాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 24 దుకాణాలకు 713 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యల్పంగా కోవెలకుంట్ల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 11 దుకాణాలకు కేవలం 150 మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాయంత్రం 7 గంటలకు ముగిసింది. అయితే ఆఫ్‌లైన్ పద్ధతిలో ఇదివరకే నమోదు చేసుకున్న వారి వివరాలు సంబంధిత స్టేషన్ అధికారి తన లాగిన్‌లో నమోదు చేసే అవకాశమున్నందున స్టేషన్ల వారీగా ప్రక్రియ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. అప్లికేషన్ రుసుం డీడీ రూపంలో తీసుకున్న వారికి రాత్రి 12 గంటల వరకు ఎంట్రీ పాస్ జారీ చేశారు. ఆన్‌లైన్‌లో గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు పేమెంట్ కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లిస్తే రాత్రి 12 గంటల వరకు ఎంట్రీ పాస్ డౌన్‌లోడ్ అవుతుందని అధికారులు పేర్కొన్నారు.
14న లాటరీ ద్వారా కేటాయింపు...
మద్యం దుకాణాలను ఈనెల 14న లాటరీ విధానంలో కేటాయించడానికి ఎకై ్సజ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 1వ తేదీ నుంచి ఎకై ్సజ్ స్టేషన్ల వారీగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో దరఖాస్తుల స్వీకరణలో నిమగ్నమైన అధికారులు ఇక లక్కీడిప్ నిర్వహణపై దృష్టి సారించారు. కర్నూలులో జిల్లాపరిషత్ సమావేశ భవనంలో, నంద్యాలలో కలెక్టరేట్ భవనంలో ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో కార్యక్రమం జరగనుంది. దరఖాస్తుల ద్వారానే ఉమ్మడి జిల్లా నుంచి ప్రభుత్వానికి రూ.103.40 కోట్లు ఆదాయం సమకూరింది.
మద్యం దుకాణాల
దరఖాస్తులు ఇలా...
ఎకై ్సజ్ స్టేషన్ దుకాణాల దరఖాస్తుల
సంఖ్య సంఖ్య
కర్నూలు 31 1,427
కోడుమూరు 14 508
ఆదోని 12 247
ఆలూరు 9 186
ఎమ్మిగనూరు 15 296
కోసిగి 4 53
(మంత్రాలయం)
పత్తికొండ 14 296
మొత్తం 99 3,013