ప్రశాంతి నిలయం: జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు.
- 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తోకలసి డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు కురిస్తే తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. విద్యుత్, వ్యవసాయ అనుబంధ, మున్సిపల్, రెవెన్యూ, గృహనిర్మాణ, పోలీసు, వైద్యం, పంచాయతీ తదితర 15 శాఖల అధికారులో సమీక్షిస్తూ క్షేత్రస్థాయిలో ప్రాథమిక సమాచారాన్ని సేకరించి విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సచివాయాలు, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటూ అవసరమైన చర్యలు, పునరావాస కేంద్రాల ఏర్పాటు, సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భారీ వర్షాలకు రహదారులు కొట్టుకుపోవడం, ఉద్యాన పంటలు దెబ్బతినడం, ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు ప్రయాణాలు, ఇతరత్ర కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని, అత్యవసరమైతే మాత్రమే ఇంటి నుంచి బయటికి రావాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను వర్షాలు, వరద నీటి తీవ్రను బట్టి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, పట్టు పరిశ్రమ శాఖల అధికారులు గ్రామాలలో ప్రజలు అప్రమత్తం చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రంలో వైద్య సిబ్బందిని కచ్చితంగా ఏర్పాటు చేసి, అవసరమైన మందులను సిద్ధంగా ఉంచాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాలు, అంతరాయాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కొండయ్య, అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మన్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్
పుట్టపర్తి టౌన్: తుపాన్ ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయంలో 91775 21113, 91775 54925 నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ప్రహల్లాద తెలిపారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని, ఎక్కడైనా ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఏర్పడినా, ప్రాణ, ఆస్తి నష్టం జరిగినా, విద్యుత్ స్తంభాల వైర్లు పడిపోయినా, చెట్లు కూలిపోయినా, కంట్రోల్‌రూమ్‌కు ఫోన్ చేస్తే పునరావాస కేంద్రాలకు తరలిస్తామన్నారు. మున్సిపల్ కార్యాలయంలో సిబ్బందికి ఎలాంటి సెలవులూ ఉండవని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు.
ఉద్యాన రైతులూ జాగ్రత్త
పుట్టపర్తి అర్బన్: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఉద్యాన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుని పంటలు కాపాడుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్ పేర్కొన్నారు. తోటల్లో నీరు నిల్వ ఉంటే కాయలు కుళ్లిపోయే ప్రమాదం ఉందన్నారు. అరటి గెలలు ఉన్న తోటల్లో పెను గాలులతో కూడిన వర్షానికి చెట్లు పడిపోకుండా కట్టెల సహాయంతో ఊతమివ్వాలన్నారు. కోతకు వచ్చిన గెలలను ముందుగానే కోసి విక్రయించుకోవాలన్నారు. బొప్పాయి పంటలో కోతకు సిద్ధంగా ఉన్న వాటిని ముందుగానే కోయాలన్నారు. కోతకు వచ్చిన పండ్లను ప్యాక్ చేసి ప్యాక్ హౌస్‌లలో నిల్వ చేయాలన్నారు. వర్షాల సమయంలో టమాట కోయరాదని, కోతకు సిద్ధంగా ఉన్న వాటిని కోసి గాలి వచ్చే ప్రదేశంలో నిల్వ చేయాలన్నారు. గాలులకు కర్రలు పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, అధిక వర్షాలకు వచ్చే మచ్చ తెగులు రాకుండా ముందు జాగ్రత్తగా 2.5 గ్రాముల ఎం45, 1 గ్రాము కార్బెండజైమ్ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. ముందుజాగ్రత్తలతో పండ్లు, కూరగాయల తోటల రైతులు అప్రమత్తంగా ఉండి సంరక్షించుకోవాలన్నారు.
వర్షాల నేపథ్యంలో అధికారులకు కలెక్టర్ ఆదేశం