హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఒకటి , రెండు మినహా మిగిలిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తేల్చేశాయి.
దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే విజయమని , ఆ పార్టీ నాయకులు సంబరాలు కూడా చేసుకున్నారు. మొత్తం 90 స్థానాలకు గానూ, 55 స్థానాలకు పైగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే లీడ్‌లో కొనసాగారు. ఉదయం 10 గంటల తర్వాత సడన్‌గా బీజేపీ రేసులోకి దూసుకువచ్చింది. దాదాపు 60 స్థానాల్లో బీజేపీ కూటమి నేతలు లీడ్‌లోకి రావడంతో , కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చివరికి 49 స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో బీజేపీ మరోసారి పాగ వేసింది.
అయితే ఈ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఓట్ల లెక్కింపు ప్రక్రియ సరిగా లేదని కాంగ్రెస్ ఆందోళనలు లేవనెత్తింది, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే విధంగా అవకతవకలు జరిగియని ఆ పార్టీ ఆరోపించింది. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫలితాలు ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపేలా ఉందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు.
తొలుత ఏడు అసెంబ్లీ స్థానాల్లో అవకతవకలు జరిగినట్టు భావించిన కాంగ్రెస్ నేతలు, తర్వాత 13 నియోజకవర్గాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలోనే అక్రమాలు జరిగినట్టు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ 13 స్థానాల్లో కూడా తమ పార్టీ అభ్యర్థులే విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ నేతల వాదన. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలతో ఈవీఎం మిషన్ల సాంకేతికతపై మరోసారి అనుమానాలు బయటపడ్డాయి.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను బీజేపీ నాయకులు కొట్టిపారేస్తున్నారు. ఓటమిని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రజాతీర్పును ఆ పార్టీ అపహాస్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ చేసే వాళ్లం అయితే జమ్మూ-కాశ్మీర్‌లో కూడా తామే గెలిచేవాళ్లం కదా అంటూ లాజిక్ పాయింట్‌తో కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెడుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.