కాలు చెయ్యి లోపమని, కొక్కిరాయి రూపమని, కళ్లు లేవని, కోతి పిల్లని నలుగురూ హేళన చేస్తున్నా.. పట్టించుకోకుండా తామెంటో, తమ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించారు మన పారా క్రీడాకారులు. నిర్దేశించుకున్న లక్ష్యం కంటే అధికంగా 29 పతకాలు సాధించి ఔరా అనిపించారు. 56 ఏళ్ల తర్వాత తొలిసారి చరిత్ర సృష్టించారు. తమ సంకల్ప బలంతో వైకల్యాన్నే కాదు, ప్రపంచాన్నే జయించిన ధీరులు వారు.
అవని లేఖరా, మోనా అగర్వాల్, ప్రీతీ పాల్, మనీషా నర్వాల్, రుబీనా ఫ్రాన్సిస్, ప్రీతీ పాల్, నిషద్ కుమార్, యోగేష్ కథునియా, నితేష్ కుమార్, తులసీమతి మురుగేశన్, మనిషా రామ్‌దాస్, సుహాస్ యతిరాజ్, రాకేష్ కుమార్, శీతల్‌దేవీ, సుమిత్ అంతిల్, నిత్యశ్రీశివన్, దీప్తి జీవాంజీ, మరియప్పన్ తంగవేలు, షరద్ కుమార్, అజిత్‌సింగ్, సుందర్ సింగ్ గుర్జార్, సచిన్ ఖిలారీ, హర్విందర్ సింగ్, ధరంబీర్, పమవ్ సూర్మా, కపిల్ పమర్, ప్రవీణ్ కుమార్, హోకాటో హోతోజ్ సీమా, సిమ్రాన్, నవదీప్ సింగ్.. వ్యక్తులు కాదు.. అసాధ్యాలను సుసాధ్యం చేసిన శక్తులు.
రెండు చేతులూ లేని కాశ్మీర్‌కి చెందిన శీతల్ దేవి, ఈ ఒలింపిక్స్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. పుట్టుకతోనే వైకల్యం బారిన పడిన శీతల్‌ది సాధారణ కుటుంబం. కృత్రిమ చేతులు పెట్టించుకునే ఆర్థిక స్థోమత లేని ఆ తల్లిదండ్రులు శీతల్‌ని చూసి కన్నీరుమున్నీరయ్యేవారు. ఇదంతా శీతల్‌కి ఊహ తెలియకముందు. అయితే శీతల్ ఎదుగుతున్నకొద్దీ తన లోపాన్ని బలహీనతగా భావించలేదు. చేతుల్లేకపోతేనేం, కాళ్లున్నాయిగా అన్నట్లు ఆమె జీవించింది. స్కూలుకు వెళ్లింది. పాఠాలు వల్లెవేసింది. చెట్లు ఎక్కింది. గంతులు వేసింది. ఓసారి స్కూలు ప్రోగ్రామ్‌లో శీతల్ ప్రతిభని చూసిన ఆర్మీ కోచ్‌లు ఆమె ఆత్మవిశ్వాసానికి ఫిదా అయిపోయారు. శీతల్ ప్రతిభని ఎలాగైనా ప్రపంచానికి చూపించాలనుకున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఆర్చరీలో శీతల్‌కి శిక్షణ ఇచ్చారు. ఆమె ఎంతటి శక్తిమంతురాలంటే, శిక్షణ తీసుకున్న 11 నెలల్లోనే పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని రజతం గెలిచింది. రెండు చేతుల్లేకుండా ఈ పోటీల్లో పాల్గొని పతకం తెచ్చిన మొదటి అమ్మాయి శీతల్. అప్పటి నుండి శీతల్ వెనక్కి తిరిగి చూడలేదు. ఈ పోటీల్లో రాకేష్ కుమార్ భాగస్వామ్యంతో కాంస్యం గెలుచుకుంది.
మన తెలుగమ్మాయి దీప్తీ జీవాంజి ఈ పోటీల్లో తన పరుగుతో కాంస్యం సొంతం చేసుకుంది. దీప్తిది తెలంగాణ, వరంగల్ జిల్లా కల్లెడ గ్రామం. మానసిక వైకల్యంతో ఎన్నో అవమానాలు పడ్డ ఆమెకి వెక్కిరింతలతోనే రోజు తెల్లారేది. ‘గ్రామంలో ప్రతి ఒక్కరూ దీప్తిని కోతి ముఖంది అని పిలిచేవారు. పిచ్చిదని అవమానించేవారు. అనాథాశ్రమానికి పంపమని చెప్పేవారు. ఊళ్లో వాళ్లు అన్న మాటలకి తిరిగి సమాధానం చెప్పలేక ఇంటికి వచ్చి ఏడ్చేది. మాటలు కూడా స్పష్టంగా రావు. అట్లాంటి నా దీప్తి ఈ రోజు ఈ ఘనత సాధించింది’ అని దీప్తి తల్లి కూతురు విజయాన్ని చెబుతూ కళ్లనీళ్ల పర్యంతమైంది.
తమిళనాడుకు చెందిన తులసిమతి మురుగేశన్‌కి ఎడమచెయ్యి లోపం ఉంది. అయితే తనకు ఉన్న లోపం గురించి గుర్తించని పసివయసులోనే అక్కతో కలసి బ్యాడ్మింటన్ ఆడేది. చెయ్యి సహకరించకపోయినా, అక్కలా గోల్ కొట్టాలని తెగ తాపత్రయపడేది. కూతురు ఉత్సాహాన్ని గుర్తించిన ఆమె తండ్రి కూడా తనని ఆ దిశగా ప్రోత్సహించాడు. ‘నువ్వు ఆడలేవు. నీకు చెయ్యి లేదు’ అని ఎప్పుడూ నిరుత్సాహపర్చలేదు. కూతురుపై ఆ తండ్రి పెట్టుకున్న నమ్మకం ఇప్పుడు ఆ ఇంటికి పతకాల వరదను తెచ్చిపెడుతున్నాయి. 2022 చైనాలో జరిగిన పారా ఏషియన్ క్రీడల్లో 3 పతకాలు, 2023 కెనడా పారా బ్యాడ్మింటన్, ఫజ్జా దుబారు పారాబ్యాడ్మింటన్ పోటీల్లో బంగారు, కాంస్య పతకాలు సాధించింది. ప్రస్తుత పారిస్ పోటిలో రజతం ఆమె సొంతమైంది. ‘తానెప్పుడూ వైకల్యాన్ని బలహీనతగా చూడలేద’ని చెప్పే తులసిమతి ప్రస్తుతం వెటర్నరీ సైన్స్ చదువుతోంది.
మహారాష్ట్ర సాంగ్లి జిల్లా కర్గానిలో రైతు కుటుంబం నుండి వచ్చాడు సచిన్. సచిన్‌కి పుట్టుకతో వైకల్యం లేదు. ఆరేళ్లప్పుడు తల్లి మరణించింది. తొమ్మిదేళ్లప్పుడు సైకిల్‌పై నుండి కిందపడి ఎడమచెయ్యి దెబ్బతింది. ఎన్ని ఆస్ప్రత్తులు తిరిగినా చెయ్యి బాగవ్వలేదు. కొడుకుని ఉన్నతస్థితిలో చూడాలనుకున్న సచిన్ వాళ్ల నాన్న, అతడిని సివిల్స్ వైపు ప్రోత్సహించాడు. తండ్రి ఇష్టం మేరకు చదువుతున్నా సచిన్‌కి ఆటలంటే మక్కువ. ఆ ప్రీతితోనే డిస్కస్ త్రో, జావెలిన్ త్రోలో శిక్షణ తీసుకున్నాడు. 2017లో పారా జాతీయ ఛాంపియన్‌షిప్ జావెలిన్ త్రోలో పసిడి పతకం కూడా సొంతం చేసుకున్నాడు. అయితే భుజం తీవ్రంగా గాయమై ఆ ఆట నుండి దూరంగా జరిగి, షాట్‌పుట్ సాధన చేశాడు. ఆ విభాగం నుండే ప్రస్తుతం పోటీల్లో పాల్గొంటున్నాడు. ఈ పోటీల్లో రజతం సాధించాడు.
లఖ్‌నవూకి చెందిన అజిత్ సింగ్ యాదవ్‌ది ఓ విషాదగాథ. అతనేమీ వైకల్యంతో పుట్టలేదు. గ్వాలియర్ లక్ష్మీబాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే ఓ వివాహానికి హాజరై తిరిగివస్తూ రైలు ప్రమాదానికి గురయ్యాడు. కదులుతున్న రైలు ఎక్కబోయి పడబోతున్న తన శిష్యుడిని కాపాడబోయి తాను ప్రమాదానికి గురయ్యాడు. చెయ్యిని కోల్పోయాడు. అయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా తన క్రీడాస్ఫూర్తిని కొనసాగించాడు. జావెలిన్ త్రో సాధన చేసి ప్రస్తుత పోటీలో రజతం సొంతం చేసుకున్నాడు.
9 ఏళ్ల వయసులో కరెంట్ షాక్ కొట్టి ఆరు నెలలు కోమాలోకి వెళ్లిపోయాడు కపిల్ పర్మార్. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన కపిల్ మెలకువ వచ్చి చూసేసరికి అంతా చీకటిగా కనిపించింది. కంటి నరాలు దెబ్బతిని స్వల్ప దృష్టి మాత్రమే ఉంది. ఆ దృష్టి లోపం కపిల్‌ని ఇంటికే పరిమితం చేయలేదు. స్వతహాగా క్రీడలపై ఉన్న ఆసక్తితో కపిల్ జూడో సాధన వైపు అడుగులు వేశాడు. 2018లో జాతీయ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. అప్పటి నుండి వెనుదిరిగి చూడలేదు. అయితే ఈ ప్రయాణంలో అతను ఎన్నో కష్టాలు పడ్డాడు. టాక్సీ డ్రైవరుగా తండ్రి సంపాదనతో ఇల్లు గడిచే పరిస్థితుల్లో శిక్షణ ఖర్చుల కోసం అన్నతో కలిసి కపిల్ టీస్టాల్ నడిపాడు. ఈ పోటీల్లో కాంస్యం గెలిచి ఆ కుటుంబానికి అమితానందాన్ని తెచ్చాడు.
ఉత్తరప్రదేశ్ గోవింద్‌గఢ్ గ్రామానికి చెందిన ప్రవీణ్‌కి ఒక కాలు పొట్టి. పొట్టి కాలు అన్న హేళనల మధ్యే అతని బాల్యం గడిచింది. కాలు సక్రమంగా లేకపోయినా ఎత్తుకు ఎగరాలన్న అతని కల నేడు పారా ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచేలా చేసింది.
హర్యానాకి చెందిన నవ్‌దీప్ 4 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉంటాడు. పొట్టి వాడని ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. చదువులో రాణిస్తున్నా, ఈ అవమానాలు దూరం కావాలంటే ఆటలొక్కటే మార్గమని నవ్‌దీప్ తండ్రి గ్రహించాడు. కొడుకుని ఆ దిశగా మళ్లించాడు. తండ్రి మద్దతుతో నీరజ్ చోప్రా స్ఫూర్తితో నవ్‌దీప్, జావెలిన్ త్రోలో శిక్షణ తీసుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే స్వర్ణం గెలిచిన నవ్‌దీప్ ఇప్పటికి ఐదు సార్లు పారా క్రీడల్లో జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. ఈసారి పోటీల్లో స్వర్ణం సాధించాడు.
‘సాధారణ అథ్లెట్ల మాదిరే మాకూ గౌరవం దక్కాలి. ఈ ప్రపంచంలో మేమూ బతుకుతున్నాం అని అందరూ గుర్తించాలి. ఎవరూ మమ్మల్ని హేళన చేయకూడదు. దేశం గర్వించేలా చేసే సత్తా మాకు ఉంది. ఎన్ని అవమానాలు ఎదురైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిలబడే మానసిక స్థైర్యం మాది’ అంటున్న ఈ పారా క్రీడాకారులు క్రీడాస్ఫూర్తికి నిజమైన వారసులు.