బుడమేరు, కృష్ణా నది వరదలు తగ్గాయి. బురద, మురుగు తగ్గలేదు. ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నారు. వరదలో ప్రధాన పార్టీల బురద రాజకీయం మాత్రం యథేచ్ఛగా సాగుతోంది. నిజాలను, తమ వైఫల్యాలను బురదలో కప్పేస్తున్నారు. గోదావరి, ఏలేరు, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో వరదలు విస్తరిస్తున్నాయి .
కృష్ణా నది, బుడమేరు వరదలతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. విజయవాడ నగరం నిండా మునిగింది. గత కొన్ని దశాబ్దాలుగా ఇంత నష్టం ఎప్పుడూ చూడలేదు. రెండు లక్షలకు పైగా కుటుంబాలు పూర్తిగా నీట మునిగాయి. సర్వస్వం కోల్పోయారు. పంట పొలాలు దెబ్బతిన్నాయి. అసంఘటిత కార్మికులు, వృత్తిదారులు, చిరు వ్యాపారులు సర్వనాశనమయ్యారు. చిన్న వ్యాపారాల మొదలు పరిశ్రమల వరకు కోలుకోలేని సంక్షోభంలో పడ్డాయి. ప్రతి కుటుంబంలో రూ.లక్ష తగ్గకుండా లక్షలాది రూపాయల వ్యక్తిగత సామగ్రి, ఆస్తి నష్టం జరిగింది. వ్యాపారం, పరిశ్రమలు, సంస్థల నష్టం అంచనాలకు మించిన రీతిలో వుంది. ప్రభుత్వమే రూ.6880 కోట్ల నష్టం జరిగిందని తక్షణ నివేదికలు రూపొందించింది. వాస్తవంగా ఈ అంచనా చాలా తక్కువ. వేలాది కోట్ల రూపాయల నష్టం జరిగింది. తక్షణ నష్టమే కాదు, ఒకజీవిత కాలానికి జరిగిన కష్టంగా కనబడుతోంది. కోలుకోవటానికి దీర్ఘకాలం పడుతుంది.
ప్రకృతి వైపరీత్యం.. పాలకుల వైఫల్యం..
ఒకే రోజులో అత్యధిక వర్షపాతం వల్ల బుడమేరుకు వరదలు వచ్చాయని ప్రభుత్వం చెబుతున్న మాట నిజమే. కృష్ణా నదికి 11.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు రావటం అసాధారణమే. ఇది కచ్చితంగా ప్రకృతి వైపరీత్యమే. అయితే పాలకులు, ప్రభుత్వాల వైఫల్యాలు దీనికి తోడు అయ్యాయి.
కృష్ణా నది తీరాన విజయవాడలో రిటైనింగ్ వాల్ (రక్షణ గోడ) నిర్మించబడింది. దీనివలన నష్టం పరిమితమయ్యింది. గోడ నిర్మాణంలో ఉన్న లోపాలవలన కొంత ప్రాంతం ముంపునకు గురైంది. ఆ లోపాలు సరిచేయాల్సిందే. తొలి నుండి సిపిఎం, ప్రజాసంఘాలు, ప్రజలు కృష్ణా కరకట్ట ఇళ్ళు తొలగించకుండా గోడ నిర్మాణం చేస్తే రక్షించవచ్చని ప్రతిపాదనలు ప్రభుత్వాల ముందు ఉంచాయి. ఆందోళనలు చేశాయి. అనేకమంది రక్షణ గోడ అడిగితే హేళన చేశారు. ఇప్పుడు తెలుగుదేశం, వైసిపి పార్టీలు ఆ గొప్పతనం తమదని పోటీ పడి చెప్పుకుంటున్నాయి. ప్రజా ఉద్యమాల ఒత్తిడి వలన ఈ గోడ నిర్మాణం సాధ్యపడింది. గోడ వలన కృష్ణా నదీ తీరాన ప్రజలను కొంతమేరకు రక్షించగలిగారు. గుంటూరు జిల్లా వైపు రక్షణ గోడలేదు. లంక గ్రామాలతో సహా ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాలలో అనేక గ్రామాలు కృష్ణ వరదలతో ముంపునకు గురయ్యాయి.
బుడమేరు ముంపు నివారణలో గత రెండు దశాబ్దాలుగా పాలించిన పార్టీలు, ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ముంపు నివారించే చర్యలను పూర్తిగా విస్మరించారు. అందుకే ఇది ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు, పాలకుల తప్పిదం, వైఫల్యం కూడా.
ఖమ్మం, ఎన్టీఆర్ జిల్లా సరిహద్దుల్లో పుట్టి వాగులు, వంకలు కలిసి బుడమేరుగా రూపాంతరం చెందింది. విజయవాడ నగరం గుండా వెళ్లి కొల్లేరులో కలుస్తుంది. ఆరు దశాబ్దాల క్రితమే బుడమేరు నీటిని రిజర్వాయర్ ద్వారా అడ్డుకట్ట వేసి సరైన రీతిలో వినియోగించుకోవచ్చని ప్రణాళికలు రూపొందించారు. అవి ఆచరణ రూపం దాల్చలేదు. ప్రజాప్రయోజనాలకు బుడమేరు నీటిని వినియోగించకుండా పాలకులు దానిని దు:ఖదాయినిగా మిగిల్చారు. బుడమేరు నీటిని కృష్ణా నదిలో కలిపే బుడమేరు డైవర్షన్ ఛానల్‌ను మరింత వెడల్పు, లోతు చేసే ప్రణాళికలు నత్త నడకన నడిచాయి. వెలగలేరు వద్ద ఉన్న రెగ్యులేటర్ నిర్వహణలోనూ లోపాలు ఉన్నాయి. విజయవాడ నగరంలో వర్షపు నీరు, డ్రైనేజీ నీరు పోయే కాలవల నిర్మాణానికి 450 కోట్ల రూపాయలు మంజూరు చేసి దశాబ్ద కాలం గడిచినా, సగం కూడా ఖర్చు పెట్టలేదు, నిర్మాణాలు పాక్షికంగా జరిగి ఆగిపోయాయి. దీనితో వరద తగ్గినా మురుగునీరు బయటకి పోయే మార్గం లేదు. బుడమేరు దిగువకు కొల్లేరులో కలిసే వరకు ఉన్న అడ్డంకులు, ఆటంకాలు నివారించే విషయంలోను పాలకుల వైఫల్యాలు కళ్ళకు కట్టినట్లు కనపడుతున్నాయి. కొల్లేరు లోను పెద్దలు వేల ఎకరాలు ఆక్రమించి చేపల చెరువులు నిర్మించారు. ఆ యా ప్రభుత్వాల కాలంలో పాలక పార్టీల నేతలు బుడమేరును ఆక్రమించి, ప్లాట్లుగా వేసి దొంగ రిజిస్ట్రేషన్లు చేసి అమ్మేశారు. సిపిఎం అనేకసార్లు పాలక నేతల ఆక్రమణలను ఆపాలని ఆందోళనలు చేసింది. ఆయా ప్రభుత్వాలు స్పందించలేదు. రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించిన, పాలిస్తున్న పార్టీలు ఈ వైఫల్యాలు అన్నింటికీ సమాధానం చెప్పాలి. జరిగిన నష్టానికి, ప్రజల కష్టాలకు వారు నైతిక బాధ్యత వహించాలి.
క్షేత్ర స్థాయికి అందని సహాయం
వరదలలో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగారు. ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలోని యంత్రాంగాన్ని దించింది. ప్రజలను ఆదుకోవటానికి కొన్ని చర్యలు తీసుకున్నారు. ప్రచారం ఎక్కువ.
క్షేత్ర స్థాయిలో పని అవసరానికి తగిన విధంగా లేదు. ఈ వాస్తవాన్ని గమనించాలి. మరోవైపు పర్యావరణ మార్పుల వలన తక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం పడటం ఊహించనిది కాదు. మూడు రోజులు ముందు నుండి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా, ప్రభుత్వం ఎందుకు కదల్లేదు? తీవ్రతను ఎందుకు గుర్తించలేదు? వెలగలేరు రెగ్యులేటర్ వద్ద గేట్లు ఎత్తివేసిన తర్వాత కూడా వరద వస్తుందని బాధితులకు ముందుగా ఎందుకు హెచ్చరించలేదు? వారిని పునరావాస కేంద్రాలకు ఎందుకు తరలించలేదు? ప్రజలకు ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదు? వరద నుండి తమను రక్షించాలని ఆర్తనాదాలు పెడుతున్నా పడవలు, ఇతర వాహనాలు తగినంతగా ఏర్పాటు చేయకపోవడం తీవ్ర తప్పిదం కాదా? ఇది కచ్చితంగా ఈ ప్రభుత్వ వైఫల్యమే. వరదను ఆపలేక పోవచ్చు, కానీ ప్రజలను, వారి ఆస్తులను కొంతలో, కొంత కాపాడే అవకాశం ఉంది. వరద అనంతరం అనేక సహాయ కార్యక్రమాలు జరిగినా, అవి క్షేత్ర స్థాయికి పూర్తి స్థాయిలో అందలేదు. వరదలో చిక్కుకున్న వారి ఇళ్ళకు ఆహారం, కనీసం మంచినీళ్లు కూడా కష్టకాలంలో అందించలేకపోవడం నేరం కాదా?
ఈ వైఫల్యాలకు బాధ్యత కూటమి ప్రభుత్వానిదే
గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం బుడమేరు వరద ముంపు నివారణ చర్యలలో ఘోరంగా వైఫల్యం చెందింది. బుడమేరు ముంపును పూర్తిగా విస్మరించింది. ఇది ముమ్మాటికి నిజం. ప్రజల కష్టాలకు నైతికంగా వారూ బాధ్యత వహించాల్సిందే. కానీ వైసిపి ప్రభుత్వ వైఫల్యాల పేరుతో టిడిపి ప్రభుత్వం తన బాధ్యతను తప్పించుకోలేదు. వైసీపీకి ముందు తెలుగుదేశం రాష్ట్రాన్ని అనేక సంవత్సరాలు పాలించింది. ఆనాడు ముంపు నివారణ చర్యలు చేపట్టలేదు. మరోవైపు వరద హెచ్చరికల విషయంలోనూ ప్రస్తుతం తీవ్ర లోపాలు జరిగాయి. తెలుగుదేశం, వైసిపి పార్టీలు పరస్పరం బురద జల్లుకుంటున్నాయి. ఈ దుస్థితికి ఇద్దరి బాధ్యత ఉంది.
చోద్యం చూస్తున్న కేంద్రం, బిజెపి
మరోవైపు గత పది సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బిజెపి చోద్యం చూస్తున్నది. కేంద్రంలోనే కాదు, రాష్ట్ర ప్రభుత్వంలోనూ గతంలోనూ, నేడు భాగస్వామిగా కూడా ఉన్నది. ప్రకృతి వైపరీత్యాలలో రాష్ట్రాలను ఆదుకొని, సహాయం చేయాల్సిన ప్రధాన బాధ్యత కేంద్రానిదే.
14 రోజులు గడిచినా వరద పర్యటనలు తప్ప, కేంద్రం చిల్లి గవ్వ విదల్చలేదు. బృందాలు, అంచనాల పేరుతో కాలయాపన చేయటం, ఆ తర్వాత నీరు కార్చటం కేంద్రానికి సహజ ప్రక్రియగా మారిపోయింది. తక్షణమే పది వేల కోట్ల రూపాయలు కేంద్రం సహాయం చేయాలని డిమాండ్ చేస్తున్నా, కేంద్ర పాలకులు నోరు మెదపటంలేదు. మోడీ విదేశీ పర్యటనలలో, అమిత్ షా కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకునే తీరిక వారికి లేదా? కేంద్రంలో, రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వంగా చెప్పుకుంటూ ఎందుకు స్పందించరు? ముఖ్యమంత్రి గళం విప్పాలి, కేంద్రంపై ఒత్తిడి పెంచాలి.
తెలుగుదేశం, వైసిపి ఒకరిపై మరొకరు విమర్శలు కురిపించు కుంటున్నారు. కేంద్రంపై ఒత్తిడి చేయడంలో విఫలం అవుతున్నాయి. ఈ విషయంలో ఇద్దరిదీ ఒకటే దారి. తక్షణ సహాయమే కాదు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు బాధితులకు సహాయం చేయడంలో నిబంధనలు సడలించాలి. బడా కార్పొరేట్లకు రుణ మాఫీ చేసే కేంద్రం. వరద బాధితులు, రైతులు, పొదుపు సంఘాలు, వ్యాపారులు, చిన్న పరిశ్రమలకు ఎందుకు మాఫీ చెయ్యదు? రుణాలు రీ షెడ్యూల్ చేయాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు దెబ్బ తిన్న వాహనాలు, ఇతర సామగ్రికి పరిహారం పూర్తి స్థాయిలో ఇవ్వాలి. గృహ నిర్మాణం, వ్యవసాయం ఇంకా అనేక పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలి. అంతేకాదు బుడమేరు ముంపు నివారణ శాశ్వత చర్యలకు కేంద్రమే బాధ్యత వహించాలి. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలి.
భజన కాదు, బాధితులకు అండగా నిలవండి
కానీ దురదృష్టవశాత్తు తెలుగుదేశం, వైసీపీలు రాష్ట్ర ప్రజలను గందరగోళంలో పడేస్తున్నాయి. వాస్తవాలను మరుగు పరుస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీని కూల్చేయడానికి కుట్ర పన్నారని ఒకరు, ముఖ్యమంత్రి ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరు గేట్లు వదిలారని మరొకరు ఇలా పరస్పర విమర్శలతో నిండా మునిగిన ప్రజలకు ఊపిరాడకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన మీడియా…ప్రజల ప్రయోజనాలను విస్మరించి, ఆయా పార్టీలకు భజన చేసే పనిలో ఉండటం విచారకరం. ఆ యా పార్టీల కార్యకర్తలు, అభిమానులు అందరూ ఆ యా ప్రభుత్వాలు, పార్టీలు తప్పులు చేసినా సమర్ధించుకుంటూ, ఎదుటివారిపై విమర్శలతోనే సంతృప్తి పడటం సరికాదు. ప్రభుత్వాలు, పార్టీలు తప్పులు చేస్తే సరిదిద్దాలి. ఎత్తిచూపాలి. అప్పుడే ప్రజలకు, ఆ యా ప్రభుత్వాలకు, పార్టీలకు కూడా మేలు జరుగుతుంది. ప్రజా కోణంతో ప్రభుత్వాలను, పాలక పార్టీలను నిలదీయాలి. వరదలపై యుద్ధం ముగిసిందని నేతలు చెబుతున్నారు. యుద్ధంలో ఒక దశ ముగిసింది. అసలు జీవన సమరం ఇప్పుడే ప్రారంభమైంది. పాలకులు దీనిని గుర్తించాలి.
ప్రభుత్వాల తక్షణ వైఫల్యాలే కాకుండా, దీర్ఘకాలిక ప్రణాళికలు, వ్యవస్థల లోపం ఈ వరదలలో స్పష్టమవుతున్నది. ప్రత్యేకించి దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రధాన నగరాలన్నీ వరదలు, వర్షాలతో ముంపుకి గురవుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పర్యావరణంలో వచ్చిన మార్పుల దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగరాల రక్షణకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి. వికసిత భారత్, విజన్ 2047 పేరుతో ఊదర గొట్టడం కాదు. వరదలు, ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజలను కాపాడే దీర్ఘకాలిక ప్రణాళికలు కావాలి. ప్రణాళికలే లేకపోవటం, ప్రణాళికలు ప్రజల దృష్టితో రూపొందించకపోవడం తీవ్ర లోపంగా కనబడుతోంది. కేంద్ర ప్రభుత్వాలు రూపొందించిన జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎమ్ స్మార్ట్ సిటీలు ఇతర అనేక పథకాలు పట్టణాలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను పరిష్కరించలేకపోయాయి. విపత్తులలో ఆదుకోవలసిన వ్యవస్థల వైఫల్యం మరోసారి నగంగా బట్టబయలు అయింది.
ప్రకృతి వైపరీత్యాలకు అందరూ బాధితులే. కానీ పేదలు, సామాన్యులు, చిరు వ్యాపారులు, రైతులు, కూలీలు, కౌలు రైతులు మరింత తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం పేదల కొరకు నిర్మించిన ఇళ్లల్లో అత్యధిక భాగం బుడమేరు ముంపు ప్రాంతాల్లోనే నిర్మించడం శోచనీయం. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బుడమేరు వరద ముంపునకు శాశ్వత చర్యలపై దృష్టి పెట్టాలి. కేంద్రం తక్షణం నిధులు విడుదల చేయాలి.
సిపిఎం, అనేక ఇతర ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు..ప్రజలను ఆదుకోవటానికి అన్ని విధాల కృషి చేస్తున్నారు. సిపిఎం నిర్వహిస్తున్న భోజన కేంద్రాలు ప్రజలకు ఆకలిని తీరుస్తున్నాయి. ఇప్పటికే 12 కేంద్రాలలో సుమారు లక్ష మందికి భోజనం పెట్టి బాధితులకు అండగా నిలిచారు. సిపిఎం ఒకవైపున ప్రభుత్వంపై ఒత్తిడి, మరోవైపున సేవా, సహాయ కార్యక్రమాలు సాగిస్తున్నది. రాబోయే కాలంలో ప్రజలందరూ ఏకమై తక్షణ సహాయం, దీర్ఘకాలిక పరిష్కారాలకై ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి.
వ్యాసకర్త సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్. బాబూరావు