నగరంలో ఉరుకులు పరుగుల జీవితం.. మానసిక సమస్యలు, చిరాకులు, కుటుంబ సమస్యలకు దారి తీస్తున్నాయనే విషయం తెలిసిందే. ఒత్తిళ్లు తట్టుకోలేక ఆందోళనలకు గురవుతూ.. మత్తుపానీయాలకు బానిసలు అవుతున్నారు. కంపెనీల్లో ఒత్తిడి ఎంతలా ఉందంటే ఒత్తిడి నుంచి బయటపడేందుకు పలు కంపెనీల్లో ప్రత్యేకంగా స్మోకింగ్ జోన్స్ ఏర్పాటు చేశాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
చాలామంది ఉద్యోగులు వారాంతాల్లో కుటుంబంతో, స్నేహితులతో కలిసి జాలీగా గడిపేందుకు ప్లాన్స్ చేసుకుంటారు. సమీపంలోని ప్రశాంతంగా ఉండే రిసార్టులకు కొందరు వెళ్తుంటారు. మరికొందరు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ కుటుంబసభ్యులతో గడుపుతుంటారు. అయితే కొందరు ఉద్యోగులు.. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మాత్రం భక్తి చింతన, ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్న వయసులోనే యువత కొత్త దారి వెతుక్కుంటూ.. నగరంలోని, శివారు ప్రాంతాల్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాల వైపు పరుగులు పెడుతున్నారు.
ఎందుకిలా..?
సాధారణంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ప్రాజెక్టులు, టార్గెట్లు, రిపోర్టులు, సబి్మషన్లు ఇలా ఒక్కటేమిటి ఎన్నో ఒత్తిళ్లతో రోజును భారంగా గడుపుతుంటారు. నెలాఖరు రాగానే లోన్లు, ఈఎంఐలు కట్టేందుకు నానా తిప్పలు మరింత కామన్. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆల్కహాల్, సిగరెట్ వంటి అలవాటు చేసుకుని, అధికంగా సేవిస్తుంటారు. దీనికి తోడు ఎలాంటి శారీరక వ్యాయామాలు లేకపోవడంతో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. దీంతో కలల ప్రపంచం ఒక్కసారిగా నేలకు దిగిపోతుంటుంది. అప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కొత్త దారి వెతుక్కుంటారు. సాధారణంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అనగానే వీకెండ్స్ పార్టీలకు వెళ్తుంటారు అని భావిస్తుంటారు. కానీ అక్కడికి వెళ్లినా కూడా తమ ఉద్యోగ జీవితాల ద్వారా వచ్చే ఒత్తిడిని తట్టుకునేంత ప్రశాంతత దొరకట్లేదని ఆధ్యాతి్మక చింతన మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
చిన్న వయసులోనే..
వారాంతాల్లో నగరంలోని పలు దేవాలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు యువతీ, యువకులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలోని పలు ప్రముఖ ఆలయాలు, ఆధ్మాత్మిక క్షేత్రాలతో పాటు శివారు ప్రాంతాల్లోని నగరాలకు కూడా ఉద్యోగులు క్యూ కడుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మాత్రమే కాకుండా విద్యార్థులు కూడా ఇక్కడికి చేరుకుని చిన్న వయసులోనే వారిలో ఏర్పడిన ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ప్రయతి్నస్తున్నారు. ముఖ్యంగా ఏకాంతంగా కూర్చుని దేవుడి ముందు ధ్యానం చేసుకుంటూ కనిపిస్తున్నారు. నగరంలోని ఇస్కాన్ టెంపుల్స్, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ వంటి క్షేత్రాల్లో నృత్యాలు చేస్తూ తన్మయత్వం చెందుతున్నారు. కృష్ణుడి సంకీర్తనలు, భజనలు చేసుకుంటూ వారిలోని ఆధ్యాత్మిక భావాన్ని చాటుకుంటున్నారు. జీవితానికి కొత్త ఒరవడిని చూపుకొంటున్నారు. జీవిత సత్యాన్ని తెలుసుకునేందుకు అన్వేషిగా బయల్దేరుతున్నారు.
ఆ రోజులే బాగున్నాయి..
చాలీచాలని డబ్బులతో ఉద్యోగం కోసం వెతుక్కుంటూ హైదరాబాద్‌లో తిరిగిన రోజులే బాగున్నాయి. అప్పుడు ఉద్యో గం వస్తే చాలు అనుకునే వాడిని. ఇప్పుడు ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం.. లక్షల్లో జీతం.. అయినా ఏదో పోగొట్టుకున్న వెలితి ఉంది. సవాలక్ష సమస్యలు చుట్టు ముడుతున్నట్లు ఉంది. ప్రశాంతత అనే మాటే కరువైంది. నెలాఖరు రాగానే లోన్లు.. ఈఎంఐల వెంట పరిగెత్తాల్సి వస్తోంది. డబ్బులు అన్నీ ఇవ్వదనే విషయం అవగతమవుతోంది. అందుకే భక్తి మార్గం ప్రశాంతతను ఇస్తుందనే ఉద్దేశంతో ప్రతి వారం ఏదైనా గుడికి వెళ్లి ఒంటరిగా కాసేపు గడుపుతాను.
- నల్లం నవీన్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
మనసుకు ప్రశాంతత
నాకు ఆధ్యాతి్మక భావన ఎక్కువ. చిన్నప్పటి నుంచి దేవాలయాలకు వెళ్లడం, పూజా కార్యక్రమాలు చేపట్టడం అలవాటు. పెళ్లయిన తర్వాత ఉద్యోగం, విధి నిర్వహణలో నిత్యం ఒత్తిడి ఎదుర్కొంటున్నాం. వారంలో శని, ఆదివారాలు రెండు రోజులు సెలవులు వస్తున్నాయి. పిల్లలు, ఇల్లు కుటుంబాన్ని చూసుకోవడానికే సరిపోతుంది. శని, ఆదివారాల్లో కుటుంబ సభ్యులంతా కలిసి ఆలయాలకు వెళ్తుంటాం. తిరుపతి, శ్రీశైలం, అరుణాచలం, వేములవాడ, యాదగిరిగుట్ట, ఈ మధ్య
స్వర్ణగిరి వెళ్లాం.
- నిహారికారెడ్డి, మియాపూర్