అనంతపురం, సెప్టెంబర్ 12 ప్రజాతేజమ్
- బాల్య వివాహాలు సమాజానికి చేటని, వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత అన్ని శాఖల అధికారులు, సమాజంలోని పౌరులపై ఉందని ఐసీడీఎస్ పీడీ డా.బిఎన్. శ్రీదేవి అన్నారు. అప్పుడే సమాజం వేగంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పిలుపు మేరకు అనంతపురంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన జీఓ ఎంఎస్ నెంబర్ 31, 39 గురించి పీడీ శ్రీదేవి వివరించారు.బాల్య వివాహ నిరోధక అధికారుల బాధ్యతలు, కర్తవ్యాల గురించి అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు అడ్డుకోవాల్సిన బాధ్యత ఐసీడీఎస్, అంగన్వాడీ టీచర్లదే కాదన్నారు. ఇప్పటి వరకు ఈ బాధ్యత ఐసీడీఎస్, అంగన్వాడీలే చూశారని పేర్కొన్నారు. ఇక నుంచి గ్రామ స్థాయిలోని అన్ని శాఖల అధికారులు బాధ్యులేనన్నారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలోనూ అన్ని శాఖల అధికారులు భాగస్వామ్యం కావాల్సిందేనని స్పష్టం చేశారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అని స్థాయిలోనూ విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేసిన చట్టాలు, జారీ చేసిన ఉత్తర్వులపై అన్ని వర్గాల వారిలో చైతన్యం తీసుకురావాలని కూడా కోరారు. బాల్య వివాహం చేసినా, ప్రోత్సహించినా, హాజరైనా అటువంటి వారందరూ శిక్షార్హులవుతారని స్పష్టం చేశారు.
బాల్య వివాహాలు చేస్తే జైలుకే: జెడ్పీ సీఈఓ ఓబుళమ్మ
- బాల్య వివాహాలు చేస్తే జైలు జీవితం తప్పదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జెడ్పీ సీఈఓ ఓబులమ్మ కోరారు. బాల్య వివాహాలను నిరోధించడంలో ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉందన్నారు. గ్రామస్థాయిలో వీఆర్వో పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. బాల్య వివాహ విషయం తెలియగానే పెళ్లి కుమార్తె, పెళ్లి కొడుకును కలసి బాల్య వివాహం వలన కలిగే అనర్థాలను తెలియజేయాలని సూచించారు.
బాల్య వివాహల వల్ల ఆరోగ్యపరంగ ఇబ్బందులు తప్పవు : డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి
- బాల్య వివాహల వల్ల ఆరోగ్యపరంగ ఇబ్బందులు తప్పవని, ఆరోగ్య పరంగానే కాకుండా మానసికంగా, శరీరకంగా, సామాజిక పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారని డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి హెచ్చరించారు. శారీరక ఎదుగుదల లేక, చిన్న వయస్సులోనే గర్భ దాలిస్తే, కొన్ని సమయాల్లో తల్లీబిడ్డ ఇద్దరూ మరణించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై తల్లిదండ్రులకు, డ్రాప్ అవుట్ పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
- డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మంజునాథ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా యుక్త వయసు పిల్లల పాపులేషన్, బాల్య వివాహల సూచికలను తెలియజేశారు. అనంతపురం రూరల్ సీడీపీఓ ధనలక్ష్మి, శింగనమల సీడీపీఓ ఉమా శంకరమ్మ, చైల్డ్ లైన్ డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ కృష్ణమాచారి, మున్సిపల్ డిప్యుటీ కమిషనర్ వెంకటేశ్వర్లు, అనంతపురం అర్బన్, రూరల్, ఆత్మకూరు, కూడేరు, రాప్తాడు మండలాల వైద్యాధికారులు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, మహిళా సంరక్షణ కార్యదర్శులు, డీ.ఆర్.డీ.ఏ, మెప్మా అధికారులు, మహిళా సంఘాల లీడర్లు పాల్గొన్నారు.