అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ డా||వి.వినోద్‌కుమార్
అనంతపురం కలెక్టరేట్
జిల్లాలో ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా||వి.వినోద్‌కుమార్ ఆదేశించారు.కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పంట నమోదు ప్రక్రియ నిర్దేశించిన గడువు సెప్టెంబరు 15వ తేదీ లోపు పూర్తిచేసే విధంగా అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. కౌలు రైతు కార్డుల జారీ ప్రక్రియలో అలసత్వం వహించకుండా నిర్దేశిత కాలంలోనే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గడానికి గల కారణాలు తెలపాలని అధికారులను కోరారు. 80 శాతం సబ్సిడీపై ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ప్రత్యామ్నాయ విత్తనాలను రైతులు అందరూ సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. గురువారం నాడు ఆల్ ఇండియా రేడియోలో ఉదయం 7.45 గంటల నుంచి 8.15 గంటల వరకు పంట సాగుదారు హక్కు పత్రంపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమం ప్రసారం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొని సమస్యలు తెలియజేసి పరిష్కారాలను తెలుసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మతో వ్యవసాయ అనుబంధం శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.