గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆన్‌లైన్ పేరుతో రాష్ట్రస్థాయిలో చేపట్టి తీవ్ర గందరగోళానికి తెర తీశారు. టీచర్ల సర్దుబాటు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. విద్యార్థులకు ఉపయోగపడకపోగా టీచర్లనూ తీవ్ర మానసిక ఇబ్బందులకు గురి చేస్తోంది. దీనికితోడు జిల్లా, మండలస్థాయి అధికారులు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ సాధారణ టీచర్లను బలి చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటిదాకా మొత్తం 513 మంది టీచర్లను సర్దుబాటు చేయగా వారిలో 485 మంది జాయిన్ అయినట్లు అధికారులు చెబుతున్నారు.
తెలుగు టీచర్ ఇంగ్లిష్ ఎలా బోధిస్తారు?
ఒక స్కూల్‌లో పని చేస్తున్న తెలుగు టీచర్‌ను పని సర్దుబాటులో భాగంగా మరో ఉన్నత పాఠశాలలో సోషల్ సబ్జెక్టు బోధించాలంటూ సర్దుబాటు చేశారు. అదికూడా ఇంగ్లిష్ మీడియంలో బోధించాలంటూ ఆదేశాలిచ్చారు. సీబీఎస్‌ఈ సిలబస్‌లో సోషల్ సబ్జెక్టు బోధించడం తమవల్ల కాదంటూ ఆ తెలుగు టీచర్లు లబోదిబోమంటున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అలాగే సోషల్ సబ్జెక్టు టీచర్‌ను తెలుగు బోధించాలంటూ అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లి స్కూల్‌కు సర్దుబాటు చేశారు. వ్యాకరణ అంశాలను బోధించడం తమవల్ల కాదంటూ సోషల్ టీచర్లు వాపోతున్నారు. వివిధ సబ్జెక్టుల్లో ఇదే సమస్య ఉంది. దాదాపు 70 మందికి పైగా టీచర్లు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు.
విద్యార్థులకు ఉపయోగపడని
టీచర్ల పని సర్దుబాటు
ఉపాధ్యాయులకూ తీవ్ర ఇబ్బందులు కల్గిస్తున్న వైనం
ఒక సబ్జెక్టు బోధిస్తుంటే
మరో సబ్జెక్టుకు సర్దుబాటు
అనుభవం లేని బాధ్యతలు
అప్పగించిన అధికారులు
కొత్త సబ్జెక్టులు బోధించలేక తలలు పట్టుకుంటున్న ఉపాధ్యాయులు
అనంతపురం కొత్తూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఉర్దూ టీచరుగా పని చేస్తున్న కలిముల్లాను మిగులుగా చూపించి పాతూరు నంబర్-2 ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సర్దుబాటు చేశారు. అక్కడ ఉర్దూ పోస్టే లేదు. ఈయనను తెలుగు సబ్జెక్టుకు కేటాయించారు. ఆయన తెలుగు ఎలా బోధిస్తాడో అధికారులకే తెలియాలి.
కుందుర్పి మండలంలో మండల స్థాయి సర్దుబాటు అయిన తర్వాత ఇంకా 14 మంది టీచర్లు మిగిలారు. కానీ మండల స్థాయిలో ఇంకా 27 ఉపాధ్యాయులు అవసరమున్నారు. అక్కడ నియమించకుండా డివిజనల్ స్థాయిలో కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో మారుమూల ప్రాంతమైన కుందుర్పి మండలంలో విద్యాబోధన కుంటు పడే ప్రమాదముందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు గగ్గోలు పెడుతున్నా విద్యాశాఖలో వినేనాథుడే కరువయ్యాడు.
అనంతపురం నగరంలోని రాజేంద్ర నగరపాలక ఉన్నత పాఠశాలలో సోషల్ సబ్జెక్టులో ఇద్దరు టీచర్లను మండలస్థాయిలో మిగులుగా చూపించారు. వీరిలో ఒక టీచరు సీనియార్టీ విషయంపై గ్రీవెన్స్ పెట్టుకుంది. ఆమె సమస్య పరిష్కరించకుండా పక్కన పెట్టేశారు. మరొక టీచర్‌ను వేరే స్కూల్‌కు సర్దుబాటు చేశారు. డివిజన్ స్థాయిలో పై ఇద్దరు కాకుండా మూడో టీచర్‌ను మిగులుగా చూపించి ఉప్పరపల్లి స్కూల్‌కు సర్దుబాటు చేశారు. తాను సీనియర్ అంటూ ఈ టీచర్ రోజూ డీఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.
సబ్జెక్ట్ టీచర్ల కొరత తీరలేదు
పని సర్దుబాటు వల్ల సబ్జెక్టు టీచర్ల కొరత తీరడం లేదు. ఉపాధ్యాయులకు వెత తప్పలేదు. చాలాచోట్ల ఎస్జీటీలనే బలవంతంగా సబ్జెక్టు టీచర్లుగా సర్దుబాటు చేస్తున్నారు. చాలా మండలాల్లో ఎంఈఓలు గీవెన్స్ క్లియర్ చేయకుండానే కౌన్సెలింగ్ చేపట్టారు. మిగులుగా లేని టీచర్లను చివరిరోజు మిగులుగా చూపించి వారి అభిప్రాయం తీసుకోకుండానే బలవతంతంగా సర్దుబాటు చేసేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండాపోయింది.
- ఆర్.శ్రీనివాసనాయక్ ఏపీటీఎఫ్-1938 జిల్లా ప్రధానకార్యదర్శి
సర్దుబాటు.. తలపోటు!