జెవివి వార్షిక 17వ మహాసభలో ప్రసంగిస్తున్న ఎఐపిఎస్‌ఎన్ మాజీ అధ్యక్షులు సవ్యసాచి చటర్జీ
ప్రజాతేజమ్ - అనంతపురం ప్రతినిధి
శాస్త్రయ దృక్పథంతోనే మానవ పురోగతి సాధ్యమని ఆల్ ఇండియా పీపుల్స్ సైన్సు నెట్‌వర్క్ (ఎఐపిఎస్‌ఎన్) మాజీ అధ్యక్షులు ప్రొఫెసర్ సవ్యసాచి చటర్జీ పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని జిఆర్.ఫంక్షన్ హాలులో రెండు రోజుల పాటు జరుగనున్న జెవివి 17వ వార్షిక మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. నగరంలోని జిఆర్.ఫంక్షన్ హాలులో ప్రొఫెసర్ భాగ్యవతి హాల్‌లో ఆదినారాయణ ప్రాంగణంలో మహాసభలను నిర్వస్తున్నారు. మహాసభ ప్రారంభం సందర్భంగా సమాతా కన్వీనర్ డాక్టర్ ప్రసూన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ రంగన్న జెవివి పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా జన విజ్ఞాన వేదికలో పనిచేసి మరణించిన ప్రొఫెసర్ భాగ్యవతి, లక్ష్మినారాయణ, ఈశ్వరయ్య తదితరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభకు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గేయానంద్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం హాజరై ప్రారంభ సందేశాన్ని ఇచ్చారు. అనంతరం ‘సైంటిఫిక్ టెంపర్- ఛాలెంజెస్’ అన్న అంశంపై ప్రొఫెసర్ సవ్యసాచి చటర్జీ ప్రారంభోపన్యాసం చేశారు. దేశంలో గూడుకట్టుకున్న అశాస్త్రీయ భావాలకు వ్యతిరేకంగా 1882 నుంచే రాజా రామ్మోహన్ రారు వంటి వారు పనిచేసారని గుర్తు చేశారు. తరువాత స్వాతంత్రోద్యమ కాలంలోనూ శాస్త్రీయతపై మరింతగా దృష్టి సారించినట్లు తెలియజేశారు. ఈ స్పూర్తితోనే స్వాతంత్య్రం అనంతరం కూడా శాస్త్రీయ దృక్పథం ప్రజల్లో పెంపొందించాలని రాజ్యాంగంలో పొందుపరినట్లు తెలియజేశారు. ఇటీవలి కాలంలో తిరోగామి శక్తులు ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంపుదలకు వ్యతిరేకంగా పని చేస్తుండడం విచారకరం అన్నారు. ఈ అవరోధాన్ని అధిగమించే దిశగా సైన్స్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుందని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ శాస్త్రీయత పెరుగుతున్న కొద్ది అశాస్త్రీయత కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమన్నారు. చదువుకున్న వారు సైతం అశాస్త్రీయ ఆలోచనతో ఉన్నారన్నారు. అందుకే దేశంలో మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. జెవివి గౌరవ అధ్యక్షులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇప్పుడు అశాస్త్రీయ ఆలోచనలున్న వారు అధికార పీఠమెక్కి కూర్చున్నారని తెలిపారు. శాస్త్రీయ ఆలోచనల వ్యాప్తిలో ఇప్పుడున్న అవరోధాల కంటే రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని సైన్స్ ప్రచారకులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ పాల్గొని సౌహార్త సందేశమిచ్చారు. ప్రస్తుత సమాజంలో సైన్స్, టెక్నాలజీ ఒక్కటేనన్న అపోహ ఉందన్నారు. సైన్స్ వేరు టెక్నాలజీ వేరని సూచించారు. సైన్స్ పెంపుదలపై ప్రస్తుతం తగినంత ప్రోత్సహం ఉండటం లేదని చెప్పారు. దీన్ని పెంపొందించడంలో కీలకంగా వ్యవహరించే విశ్వవిద్యాలయాల్లోనే పరిశోధనలు జరగకపోవడం శోచనీయమన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో సైన్స్ ఉద్యమంతో కలసి యుటిఎఫ్ పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం విద్యా విధానంలో ప్రభుత్వాలు తీసుకొస్తున్న మార్పులతో విద్యార్థుల్లో శాస్త్రీయత కొరవడే అవకాశాలున్నాయన్నారు. చరిత్రను సైతం పూర్తిగా మార్చి వేస్తున్నారన్నారు. సామాజిక కార్యకర్త బోస్ మాట్లాడుతూ విద్యా, వైద్యంలో శాస్త్రీయతను పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్రా రామారావు, ఉపాధ్యక్షులు భాస్కర్, జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ హేమలత, సమతా కన్వీనర్ డాక్టర్ ప్రసూన, జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మినారాయణ, సత్యసాయి జిల్లా కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, మెడికల్ రెప్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు మనోహర్, కవి, రచయిత కంబదూరు షేక్ నబిరసూల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ హేతవాది రాధాకృష్ణ మూర్తి
జెవివి వార్షిక మహాసభల్లో ప్రముఖ హేతువాది రాధాకృష్ణ మూర్తి ప్రత్యేక ఆకర్షినగా నలిచారు. ఈయన వయస్సు ప్రస్తుతం 90 ఏళ్లు. ఈ వయసులోనూ ఆయన జెవివి వార్షిక మహాసభలకు విచ్చేయడం అందరినీ ఆకట్టుకుంది. నవడలేని, మాట్లాడలేని స్థితిలో ఉన్న కర్రపట్టుకుని ఇతరుల సహయంతో విచ్చేశారు. అందరికీ అభివాదం చేశారు. ఆ సమయంలో మహాసభకు విచ్చేసిన ప్రతినిధులు కరతాల ధ్వనులతో రాధాకృష్ణమూర్తికి అభినందనలు తెలిపారు.