దిగుమతి సుంకం 20 శాతం పెంపు
న్యూఢిల్లీ : ప్రస్తుత పండగ సీజన్‌లో వంట నూనెలు ప్రియం కానున్నాయి. వంట నూనెలపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎక్కువగా వాడుతున్న పామాయిల్, సోయానూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు తగ్గితే డిమాండ్ పెరిగి వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. దేశీయంగాను ప్రత్యామ్నాయం లేకపోవడంతో దిగుమతి సుంకం పెంచడం ద్వారా వినియోగదారులపై భారం పడనుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. పెంచిన దిగుమతి సుంకాలు సెప్టెంబర్ 14 నుంచి అమల్లోకి వచ్చాయి.
ప్రపంచంలోనే అత్యధికంగా వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ టాప్‌లో ఉంది. ప్రతీ ఏడాది దేశీయంగా వినియోగించే వంటనూనెల్లో 70 శాతం కంటే ఎక్కువ ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ప్రధానంగా అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి వంట నూనెలను కొనుగోలు చేస్తోంది. ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి పామాయిల్ దిగుమతి జరుగుతుంది. మొత్తం దిగుమతుల్లో పామాయిల్ వాటా 50 శాతంగా ఉంది.
దేశీయ నూనె గింజల రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలో ముడి పామాయిల్, సోయానూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను వసూలు చేస్తుండడంతో గతంలో ఉన్న దిగుమతి సుంకం 5.5 శాతాన్ని 27.5 శాతానికి పెంచినట్లయ్యింది. రిఫైన్డ్ పామాయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో ఉన్న 13.75 శాతం సుంకాన్ని 35.75 శాతానికి చేర్చుతూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే వారం నుంచి పెరిగిన ధరలు వినియోగదారులపై ప్రభావం చూపవచ్చని న్యూఢిల్లీలోని డీలర్లకు చెందిన గ్లోబల్ ట్రేడ్ హౌజ్ పేర్కొంది.