– అర్ధ సెంచరీలు చేసిన శ్రీకర్ భరత్, రిక్కీ భుయ్
– శాశ్వత్ రావత్ సూపర్ సెంచరీ
– ఇండియా– ఏ 224/7
– ఇండియా– సీతో మ్యాచ్
– సంజు సామన్స్ మెరుపులు
– ఇండియా– డీ 306/5
– శ్రేయస్ అయ్యర్ డకౌట్
– ఇండియా– బీతో మ్యాచ్
అనంతపురం, సెప్టెంబర్ 19 :
దులీప్‌ట్రోఫీలో భాగంగా అనంతపురంలోని ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్‌లో ఆఖరి రౌండ్‌కు సంబంధించి గురువారం ఇండియా ఏ, సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏ జట్టు క్రీడాకారుడు శాశ్వత్ రావత్ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. ఇండియా బీ, డీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇండియా డీ జట్టు ఆటగాడు సంజుసామన్స్ మెరిశాడు. ఇతనికితోడుగా ఆంధ్ర ఆటగాళ్లు శ్రీకర్‌భరత్, రిక్కీ భుయ్‌లు అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నారు. దీంతో డీజట్టు భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. ఇండియా డీ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి డకౌట్ అయ్యాడు.
సెంచరీతో కదంతొక్కిన రావత్ ఇండియా– ఏ 224/7:
ఇండియా ఏ, సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇండియా సీ జట్టు టాస్ నెగ్గి ఫీల్డింగ్ తీసుకుంది. ఇండియా సీ జట్టు బౌలర్ల ధాటికి ఇండియా ఏ జట్టు 36 పరుగులకే ఐదు కీలకమైన వికెట్లు కోల్పోయింది. ప్రతమ్ సింగ్ 6, కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 6, తిలక్‌వర్మ 5, రియాన్ పరాగ్ 2, కుమార్ కుషగ్రా డకౌట్ అయ్యారు. ఈ దశలో శాశ్వత్‌రావత్, సామ్స్ ములానీ వికెట్ పడకుండా బాధ్యతాయుతంగా ఆడారు. ప్రధానంగా శాశ్వత్ రావత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అవకాశం దొరికినప్పుడల్లా సింగిల్స్, డబుల్స్ తీసుకుంటూ..బంతులను బౌండరీలుగా మలిచాడు. జట్టు స్కోర్ 123 పరుగుల వద్ద సామ్స్ ములానీ 44(5 ఫోర్లు, ఒక సిక్సర్) పరుగుల వద్ద అరో వికెట్ రూపంలో ఔట్ అయ్యాడు. ఈ దశలో శాశ్వత్ రావత్ దూకుడు పెంచాడు. ఈ క్రమంలో సెంచరీ సాధించాడు. ఆటముగిసే సమయానికి శాశ్వత్ రావత్ 235 బంతుల్లో 15 ఫోర్ల సహాయంతో 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. అవేశ్‌ఖాన్ 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ఇండియా సీ జట్టు బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ 3, విజయ్‌కుమార్ వైశాక్ 2 వికెట్లు తీసుకున్నాడు.
ఇండియా– డీ 306/5:
టాస్ నెగ్గిన ఇండియా బీ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా డీ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. 77 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్లు దేవదత్ పడిక్కిల్, శ్రీకర్ భరత్‌లు అర్ధసెంచరీలు చేశాడు. మొదటి వికెట్‌కు వీరు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 50 పరుగులు చేసిన పడిక్కిల్‌ను నవదీప్‌సైనీ పెవిలియన్‌కు పంపాడు. మరో ఓపెనర్ శ్రీకర్ భరత్ 105 బంతులు ఎదుర్కొని 9 ఫోర్ల సహాయంతో 52 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఆంధ్ర ఆటగాడు రిక్కీ భుయ్ 87 బంతుల్లో 9 బౌండరీల సహాయంతో 56 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి డకౌట్ అయ్యాడు. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన సంజు సామ్సన్ మెరుపులు మెరిపించాడు. అవకాశం దొరికినప్పుడు బంతిని సిక్సర్, బౌండరీగా మలిచాడు. 83 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 89 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. మరో బ్యాట్స్‌మెన్ సరాన్స్‌జైన్ 26 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. బీ జట్టు బౌలర్లలో రాహుల్ చాహర్ 3 వికెట్లు పడగొట్టాడు. ముకేష్‌కుమార్, నవీదీప్‌శైనీ చెరో వికెట్ తీసుకున్నారు.