ప్రతి ఎకరాకి, చెరువుకి నీరివ్వాలి

Praja Tejam
0


- : ప్రజలకు జవాబుదారీగా, బాధ్యతగా అధికారులు పనిచేయాలి

- : క్షేత్రస్థాయిలో పర్యటించాలి.. కెనాల్ చుట్టూ తిరగాలి.. ఇందులో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం

- : తాము ఖచ్చితంగా ప్రజల కోసమే పని చేస్తాం.. ఎలాంటి మొహమాటానికి తావు లేదు

- : రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్

అనంతపురం, సెప్టెంబర్ 19 :

- గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా జిల్లాలో అవకాశం ఉన్న ప్రతి ఎకరాకి, ప్రతి చెరువుకు నీరు ఇవ్వాలని, ఇందుకోసం అధికారులు బాధ్యతగా, జవాబుదారీతనంతో పనిచేయాలని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ఆదేశించారు.


- అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో గురువారం సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్, ఐఏబి చైర్ పర్సన్ మరియు జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జిల్లా ఎస్పీ పి.జగదీష్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


- ఈ సందర్భంగా మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలని, హెచ్.ఎల్.సి కెనాల్ చుట్టూ తిరగాలని, ఇందులో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించమన్నారు. నీరు అందుబాటులో ఉండి ఇవ్వకపోతే ఎలా అని, క్షేత్రస్థాయి పరిశీలనలో ఎక్కడ విఫలం అవుతున్నామనేది చూసుకోవాలని, ఉదయం, సాయంత్రం అధికారులు అంతా కాలవలపై తిరగాలన్నారు. క్షేత్రస్థాయిలో జేఈలు 100 శాతం, డిఈలు 50 శాతం, ఈఈలు 25 శాతం, ఎస్ఈలు 10 శాతం క్షేత్రస్థాయిలో అధికారులంతా పర్యటించి పరిశీలన చేయాలని, హెచ్.ఎల్.సి అధికారులతోపాటు మైనర్ ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలన్నారు. తాడిపత్రి, సింగనమల నియోజకవర్గాలలో చివరి ఆయకట్టు వరకు నీరు ఇచ్చేలా చూడాలన్నారు. కాలవల వెంట ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలన చేయాలని, గతాన్ని చూస్తూ ఉండకుండా తాత్కాలిక పద్ధతిలో షెడ్యూల్ ప్రకారం ఆయకట్టులోని ప్రతి ఎకరాకి నీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కాలవల పరిధిలో ప్రతి కిలోమీటర్ కు ఒక అధికారిని నియమించాలని, ఇందుకోసం అన్ని శాఖల అధికారులను భాగస్వామ్యం చేయాలని, క్షేత్రస్థాయిలో రైతుల నుంచి ఎటువంటి సమస్య వచ్చినా సంబంధిత అధికారే బాధ్యత వహించాలన్నారు. సింగనమల నియోజకవర్గంలోని మధ్య పెన్నార్ దక్షిణ కాలువ (ఎం.పీ.ఎస్.సి) పరిధిలో రెండు రోజులపాటు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఈనెల 23వ తేదీన కాలువకు నీరు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. తమ ప్రభుత్వం అందరి ప్రభుత్వమని, ఇందులో ఉద్యోగులు ప్రధాన భాగమని, ఉద్యోగులకు ప్రజల పట్ల నిర్లక్ష్యం ఉండరాదని, అధికారులంతా ఒక గ్రూపు గా ఉండాలని, ఏ ఎమ్మెల్యేల నుంచి ఫోన్ వచ్చినా వెంటనే స్పందించాలని, వెంటనే సమస్యలను పరిష్కరించాలన్నారు. తాము ఖచ్చితంగా ప్రజల కోసమే పని చేస్తామని, ఇందులో ఎలాంటి మొహమాటానికి తావు లేదన్నారు. జిల్లాకు వచ్చే నీటి వాటాని మరింత పెంచుకునేందుకు చూడాలని, అదనంగా ఏ రూపంలో నీటిని తెచ్చుకోవచ్చో అధికారులు ఆలోచన చేయాలన్నారు. పాఠశాల విద్యార్థుల నుంచి ప్రజల వరకు అందరికీ నీటి ప్రాధాన్యత తెలపాలని, ఇందుకోసం అధికారులు కృషి చేయాలన్నారు.


- జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయని, వాటి పరిశీలనకు ఈనెల 22వ తేదీన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రానున్నారన్నారు. అదే రోజు ముందుగా కర్నూల్ జిల్లాలో నీటి ప్రాజెక్టులను పరిశీలించి అనంతరం అనంతపురం జిల్లాలో పర్యటిస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద జిల్లాకు లబ్ధి చేకూర్చేందుకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ బాధ్యత తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వాల పథకాల ద్వారా జిల్లాకు లబ్ధి చేకూర్చేందుకు కృషి చేయాలన్నారు. హెచ్.ఎల్.ఎం.సి ఆధునీకరణ పనులకు సంబంధించి జీవో నం.365 తేదీ 8.7.2020లో రద్దుపరిచిన జీవో ఐదు సంవత్సరాల వరకు తిరిగి పనులు చేపట్టరాదనే క్లాజ్ ను తీసివేసి పనులు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు.


- తుంగభద్ర డ్యామ్ గేటు ప్రాంతం ఏ పరిస్థితుల్లో కొట్టుకుపోయిందో అనే దానిపై ఒక కమిటీని వేసి క్షుణ్ణంగా నిజనిర్ధారణ చేసి ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా తీర్మానాలు చేయడం జరిగింది. తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడానికి బాధ్యులు ఎవరు అనేది తెలపాలని, తప్పెక్కడ జరిగింది అనేది పరిశీలించాలని, ఇది మళ్ళీ జరగకూడదన్నారు. డ్యామ్ గేటు కొట్టుకుపోయిన సమయంలో సకాలంలో మాకు నమ్మకం ఇచ్చి ప్రతి చుక్కని కాపాడాలని చెప్పి, ఆ దిశగా చర్యలు తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే డ్యామ్ గేటు ఏర్పాటులో కృషిచేసిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకి, రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు చేస్తున్నామన్నారు. తుంగభద్ర డ్యామ్ గేటు తయారు చేయడంలో భాగస్వామమైన జేఎస్డబ్ల్యు స్టీల్, హిందుస్థాన్, నారాయణ ఇంజనీర్ సంస్థలకు కూడా ధన్యవాదాలు తెలిపారు.


- సాగునీటి సలహా మండలి సమావేశంలో ఈ ఏడాది హెచ్.ఎల్.సి కెనాల్ కు కేటాయించిన 26.368 టీఎంసీల నీటిలో మొదటి ప్రాధాన్యతగా 10 టీఎంసీల త్రాగునీటి అవసరాలకు కేటాయించడం జరిగింది. మిగిలిన 16.368 టీఎంసీల నీటిని సాగునీటి అవసరాలకు కేటాయించడం జరిగింది. తుంగభద్ర జలాశయానికి 22.7.2024న నీటిని విడుదల చేయగా, పెన్నా అహోబిలం సమతుల జలాశయం ( పీఏబీఆర్)కు 28.07.2024న నీటిని విడుదల చేయగా, మధ్య పెన్నార్ జలాశయం (ఎంపిఆర్)కు 30.07.24న నీటి విడుదల చేయగా, హై లెవెల్ మెయిన్ కెనల్ (హెచ్.ఎల్.ఎం.సి)కి, గుంతకల్లు ఉపకాలవ (జిబిసి)కి 10.08.2024న నీటి విడుదల చేశారు. మధ్య పెన్నార్ ఉత్తర కాలువ (ఎం.పీ.ఎస్.సి)కి 01.10.2024వ తేదీన, మధ్య పెన్నార్ దక్షిణ కాలువ (ఎం.పీ.ఎస్.సి)కి 23.09.2024వ తేదీన, తాడిపత్రి ఉప కాలువ (టి.బి.సి)కి 01.11.2024న చిత్రావతి సమతుల జలాశయం (సీ.బీ.ఆర్)కి 01.11.2024వ తేదీన, పీఏబీఆర్ కుడి కాలువకి 01.12.2024వ తేదీన నీటిని విడుదల చేసేందుకు ప్రతిపాదించి ఆమోదించడం జరిగింది.

- ఈ సమావేశంలో డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ కె.నాగరాజ, కన్వీనర్ మరియు హెచ్.ఎల్.సి ఎస్ఈ రాజశేఖర్, హెచ్.ఎన్.ఎస్.ఎస్ ఎస్ఈ దేశేనాయక్, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ విశ్వనాథరెడ్డి, ఆర్డీవోలు వసంత బాబు, రాణి సుస్మిత, శ్రీనివాసులు రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శిరీష, ఆయా శాఖల ఈఈలు, డిఈలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">