బ్యారేజీ వద్దకు వచ్చిన బోట్లు టిడిపి వారివే గుంటూరు జైలులో మాజీ ఎంపి నందిగం సురేష్‌కు జగన్ పరామర్శ
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ వైఫల్యాల నుంచి బయటపడేందుకు వైసిపి నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. టిడిపి రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టు అయిన మాజీ ఎంపి నందిగం సురేష్‌ను బుధవారం గుంటూరు జిల్లా జైలులో జగన్ ములాఖత్ అయ్యారు.
అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… విజయవాడ, గుంటూరులో వరదల వల్ల 60 మంది మృతి చెందారని, ఇందుకు చంద్రబాబే కారణమని, ఆయనపై కేసు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. వాతావరణశాఖ ముందుగానే హెచ్చరికలు చేసినా పట్టించుకోలేదని, తన ఇల్లు మునిగిన తరువాత చంద్రబాబుకు వరద గుర్తుకు వచ్చిందన్నారు. టిడిపి నేతల బోట్లు వచ్చి బ్యారేజీకి ఢకొీడితే వైసిపి నేతలంటూ తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. టిడిపి ఎన్‌ఆర్‌ఐ కమిటీ అధ్యక్షులు కోమటి జయరాం తమ్ముడు కోమటి రామ్మోహనరావు, టిడిపి నాయకుడు ఉషాద్రికి 2019కి ముందే బోట్లను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చారన్నారు. టిడిపి కార్యాలయంపై మూడేళ్ల క్రితం దాడి ఘటనపై అప్పట్లోనే తమ ప్రభుత్వం దర్యాప్తు చేసి దోషులపై 41ఏ కింద నోటీసులు ఇచ్చి కేసు దర్యాప్తును ముగించిందన్నారు. తనను వ్యక్తిగతంగా అసభ్య పదాలతో దూషించిన టిడిపి నాయకుడు పట్టాభి వైఖరికి నిరసనగా తమ పార్టీ కార్యకర్తలు టిడిపి కార్యాలయం వద్ద ధర్నాకు వెళితే ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేశారని, వారిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని విమర్శించారు.