ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి-కొన్ని పరిశీలనలు

Praja Tejam
0

 Facebook


విభజిత ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి ఎలా సాధించాలి? అనే అంశంపై చర్చ జరుగుతూనే వుంది. ఉమ్మడి రాష్ట్రంగా వున్నప్పుడు అభివృద్ధి అంతా హైదరాబాద్‌ కేంద్రంగానే జరిగింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో కొంతవరకు విశాఖపట్నం మినహాయించి మిగతా జిల్లాలలోగాని, నగరాల్లోగాని పరిశ్రమలు పెరగలేదు. వ్యవసాయం అభివృద్ధి చెందలేదు. ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థలు, పత్రికలు వ్యాపారాలన్నీ హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల కేంద్రీకృతమయ్యాయి. 2014 తరువాత ఏర్పడిన రెండు ప్రభుత్వాలు అభివృద్ధి పట్ల స్పష్టమైన వైఖరి లేకుండా పరిపాలించాయి. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరించిన ‘నయా ఉదారవాద నమూనా’, 2019-24 మధ్య వై.యస్‌.జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అనుసరించిన ‘బటన్‌ నొక్కుడు’ నమూనా-రెండూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడేవి కావని దశాబ్ద కాలం నిరూపించింది.

అభివృద్ధి అంటే?
భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా పెరిగిందని భారత ప్రభుత్వం ఊదరగొడుతున్నప్పటికీ, మానవాభివృద్ధిలో భారత దేశం గత దశాబ్ద కాలంలో ఎప్పుడూ 130-135 స్థానాల మధ్య కొనసాగుతున్నది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ కూడా జాతీయ మానవాభివృద్ధిలో 12 లేక 13వ స్థానంలో ఉంటున్నది. అభివృద్ధి అంటే ఆర్థికాభివృద్ధితో పాటు మానవాభివృద్ధి, ప్రాంతీయ అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, సుస్థిర అభివృద్ధిల మధ్య సమతౌల్యత సాధించినప్పుడే రాష్ట్రం స్థిరంగా ముందుకు వెళ్లటానికి అవకాశం ఉంటుంది.

అభివృద్ధా? సంక్షేమమా?
విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి ముఖ్యమా? సంక్షేమం ముఖ్యమా? అనే చర్చ కొనసాగుతున్నది. 2014-19ల మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని హడావిడి చేసింది. సమగ్ర అభివృద్ధి దృక్పథంతో ఆలోచనలు చేయలేదు. 2019-2024 మధ్య జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం పేరుతో ‘బటన్‌ నొక్కుడు’ తప్పితే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు వేటినీ చేపట్టలేదు. ఇరిగేషన్‌, మౌలిక వసతులు, రోడ్లు మొదలగు వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.
అభివృద్ధి, సంక్షేమం పరస్పర విరుద్ధ భావనలని, ఈ రెండింటిలో ఏదో ఒకదానిని మాత్రమే ప్రజలు ఎంచుకోవాలని పాలకులు చెబుతున్నారు. ఇది సరికాదు. అభివృద్ధి, సంక్షేమం వేర్వేరు కాదు. పరస్పర విరుద్ధమైనవి అంతకన్నా కాదు. సంక్షేమంతో కూడిన ఆర్థిక ప్రగతి వలన మాత్రమే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆర్థికాభివృద్ధితోపాటు మానవాభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, సుస్థిర అభివృద్ధిలపై ప్రత్యేక దృష్టి సారించవలసి ఉంటుంది.

ప్రాంతీయ అసమానతలు
రాష్ట్రంలో తీవ్రమైన ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. విభజన చట్టం…13 జిల్లాలలో ఏడింటిని (రాయలసీమ 4 జిల్లాలను, ఉత్తరాంధ్ర 3 జిల్లాలను) వెనకబడిన జిల్లాలుగా ప్రకటించింది. వీటితోపాటు ప్రకాశం జిల్లా కూడా చాలా వెనకబడి ఉన్నది. అభివృద్ధి చెందాయని భావించే జిల్లాలలో కూడా వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతం ఆర్థిక, సామాజిక, విద్యా ప్రమాణాలలో వెనుకబడి ఉన్నది. గుంటూరు ఉమ్మడి జిల్లాలో బొల్లాపల్లి, వెల్దుర్తి మొదలగు మండలాలలో గుక్కెడు మంచినీళ్లు దొరకని పరిస్థితి. ఈ రెండు మండలాలకు 50 కిలోమీటర్ల దూరంలోనే నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఉన్నది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎ.కొండూరు మండలాలలో గిరిజన తండాలలో మంచినీరు లేక సుమారు 2 వేల మంది కిడ్నీ జబ్బులకు గురై, ఇప్పటికే 200 మందికిపైగా మరణించారు. ఎ.కొండూరుకు 70 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నది ఉన్నది. ఇటువంటి అనేక ఉదాహరణలు అన్ని జిల్లాలలో ఉన్నాయి.
విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ సమతౌల్యత సాధించటం ఒక పెద్ద సవాలుగా చెప్పొచ్చు. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక కృషి జరగాలి. ఉమ్మడి రాష్ట్ర అనుభవాల దృష్ట్యా ‘అభివృద్ధి వికేంద్రీకరణ నమూనా’ను అనుసరించవలసి ఉంటుంది. ఇరిగేషన్‌, పరిశ్రమలు మొదలగు వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆంధ్రప్రదేశ్‌కు వరమైన 972 కిలోమీటర్ల పొడవైన ఇచ్ఛాపురం నుంచి తడ వరకు గల సముద్ర తీరాన్ని అభివృద్ధికి వినియోగించుకోవాలి. ఓడరేవులను ప్రభుత్వ రంగంలో అభివృద్ధి చేయాలి.

విభజన చట్టం, ప్రత్యేక హోదా
2014లో రాష్ట్ర విభజన చేయటానికి ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం చేశారు. దీనిలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అనేక హామీలు ఇచ్చారు. ముఖ్యంగా పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణాలకు నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. 7 వెనుకబడిన జిల్లాలకు ‘బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ’ ఇస్తామని ప్రకటించారు. 11 జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తామని, కడపలో ఉక్కు కర్మాగారం, దుగ్గరాజపట్నంలో ఓడరేవు, విశాఖలో రైల్వేజోన్‌, విశాఖపట్నం-విజయవాడలలో మెట్రో రైలు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారు. వీటిలో ఏ ఒక్క హామీని మోడీ ప్రభుత్వం అమలు చేయలేదు. హామీల అమలులో మోడీ ప్రభుత్వం గత పదేళ్లుగా 5 కోట్ల ఆంధ్రులకు అన్యాయం చేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వినియోగించుకుని, విభజన హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
ప్రత్యేక హోదా ఇస్తామని 2014 ఫిబ్రవరిలో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పార్లమెంట్‌లో స్పష్టమైన హామీ ఇచ్చారు. మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా రకరకాల కారణాలు చెప్పింది. ప్రత్యేక హోదా వల్ల పారిశ్రామిక రాయితీలు, పన్నులు మినహాయింపులు లభించి రాష్ట్రంలోకి పరిశ్రమలు రావటానికి అవకాశముండేది. పారిశ్రామిక అభివృద్ధి ద్వారానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికంగా పూర్తిగా వెనుకబడి ఉన్నది.

నీటి పారుదల, వ్యవసాయం
ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగం వ్యవసాయ రంగం. ఈ రంగం ద్వారానే తొలి అభివృద్ధి జరుగుతుంది. వ్యవసాయ రంగ అభివృద్ధికి నీటిపారుదల రంగం దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి, కృష్ణా, పెన్నా వంటి నదులతో పాటు అనేక చిన్న నదులు ఉన్నాయి. గత నెల రోజుల కాలంలో కృష్ణా, గోదావరి నదులకు వచ్చిన వరదల వల్ల వేలాది టి.యం.సిల నీరు సముద్రంలో వృథాగా కలసిపోయింది. అదే సమయంలో ఇంకా కోటి ఎకరాలకు ఆంధ్రప్రదేశ్‌లో సాగు నీరు అందించవలసి వుంది.
గత కొన్నేళ్లుగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. ప్రాజెక్టుల నిర్మాణం నత్త నడక నడుస్తున్నది. గత ఐదేళ్లలో వై.యస్‌.జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఇరిగేషన్‌కు బడ్జెట్‌లో రూ.62 వేల కోట్లు కేటాయించి కేవలం రూ.32 వేల కోట్లు ఖర్చు చేసింది. ఉత్తరాంధ్రలో వంశధార, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమలో గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులు ఏ ప్రభుత్వం ఉన్నప్పటికి పూర్తి నిర్లక్ష్యం చేయబడ్డాయి. ప్రకాశం జిల్లాకు ప్రాణప్రదమైన వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే 5 లక్షల ఎకరాలకు నీళ్లు, 500 గ్రామాలకు మంచినీళ్లు లభిస్తాయి. చెరువులు, కుంటలు, చిన్న తరహా నీటి పథకాలను, ఎత్తిపోతల పథకాలను కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కాల్వల ఆధునికీకరణ జరగలేదు.
విభజన చట్టంలో సెక్షన్‌ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం బాధ్యత వహించాలి. పునరావాసం, అటవీ అనుమతులు మొదలైనవన్నీ కేంద్రం బాధ్యత. 2017లో ప్రాజెక్టు నిర్మాణానికి 55 వేల కోట్లు అంచనా వేస్తే 33 వేల కోట్లు పునరావాసానికి ఖర్చు చేయాలి. ప్రాజెక్టు నిర్మాణం 72 శాతం పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికి పునరావాసం జరిగినది కేవలం 12 శాతం మాత్రమే. పోలవరం పునరావాసం, నిర్వాసితుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి.
వ్యవసాయ రంగంలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గిట్టుబాటు ధర, మార్కెటింగ్‌ సౌకర్యాలు, రుణాలకు సంబంధించి ప్రభుత్వ విధానాలు రైతాంగానికి అనుకూలంగా లేవు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో 70 శాతంపైగా కౌలు రైతులు ఉన్నారు. రాష్ట్రంలో కౌలురైతుల రక్షణకు చట్టాలు లేవు. 2019లో వై.యస్‌.జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం చేసిన కౌలురైతుల చట్టం కౌలు రైతుల ప్రయోజనాలను సమూలంగా దెబ్బతీసింది. ఈ చట్టాన్ని రద్దు చేయాలి. నూతన ప్రభుత్వం కౌలురైతులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టవలసి ఉంది.

సమగ్ర అభివృద్ధి ఆవశ్యకత
అభివృద్ధి అంటే సమాజంలో కొద్ది మంది అభివృద్ధి కాదు. రాష్ట్రంలోని 5 కోట్ల మందికి పైగా ప్రజలలో 18 శాతం దళితులు, 6 శాతం గిరిజనులు, 9 శాతం మైనారిటీలు, 48 శాతం పైగా వెనుకబడిన తరగతుల వారున్నారు. గ్రామీణ పేదలున్నారు. ఇప్పటికి 64 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాలలో నివశిస్తున్నారు. వీరందరి ఆర్థిక, సామాజిక, విద్యాపరమైన జీవన ప్రమాణాలలో పెరగాలంటే ఆర్థికాభివృద్ధితో పాటు, సమ్మిళిత, సుస్థిర, మానవాభివృద్ధి కూడా జరగాలి. రాజధానిగా అమరావతి కొనసాగిస్తూ, ఆ ప్రాంత అభివృద్ధితోపాటు, రాష్ట్రంలో ప్రాంతీయ సమతౌల్యం ఉండేలా సమగ్ర అభివృద్ధి జరగాల్సిన అవసరమున్నది.

/ వ్యాసకర్త శాసనమండలి సభ్యులు కె.యస్‌.లక్ష్మణరావు సెల్‌ : 8309965083 /

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">